క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన మహానేత పీవీ

గాంధీభవన్‌లో..
.మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకుని బుధవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, అనిల్‌కుమార్‌ యాదవ్‌, వినోద్‌కుమార్‌, కల్వసుజాత ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ ఘాట్‌ వద్ద మాజీ ఎంపీ మల్లు రవి, నాయకులు హర్కర వేణుగోపాల్‌ నివాళులర్పించారు.
పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన మహానేత పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ రరావు కొనియాడారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. భారత మాజీ ప్రధాని పీవీ 102వ జయంతి సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు అని గుర్తు చేశారు. ‘దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పివి నర్సింహారావు’ అని పేర్కొన్నారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని తెలిపారు. వారి సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నదని పేర్కొన్నారు. వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వివరించారు. ‘తెలంగాణ ఠీవి మన పీవీ’ అని సీఎం పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.
అసెంబ్లీలోనూ…
అసెంబ్లీలోని ఆయన నిలువెత్తు చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాష్‌ మాట్లాడుతూ దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని పీవీ నరసింహారావు అని తెలిపారు. తన ఆలోచన విధానంతో దేశానికి మార్గాన్ని చూపారని చెప్పారు. ఆయన చూపిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికి దేశంలో అమలు అవుతున్నాయని కొనియాడారు. శాసనసభ చీఫ్‌ విప్‌ వినరు భాస్కర్‌, పీవీ కూతురు ,ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్సీ యల్‌.రమణ తదితరులు నివాళులర్పించారు.

Spread the love