వర్షాకాలం…

– బస్సులు జాగ్రత్తగా నడపండి
 – డ్రైవర్లకు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ సూచనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున్న డ్రైవర్లు బస్సుల్ని జాగ్రత్తగా నడుపుతూ, ప్రమాదాలను నివారించాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. వారం రోజులపాటు రాష్ట్రంలో భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వేగనియంత్రణ పాటిస్తూ, మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలని సూచించారు. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటిస్తూ, వర్షం ఎక్కువగా ఉన్నచోట వైపర్‌ వాడుతూ హారన్‌ కొట్టాలని తెలిపారు. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలనీ, నదులు, కల్వర్టుల వద్ద ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. డ్యూటీకి బయలుదేరేటప్పుడే వైపర్‌, హెడ్‌లైట్స్‌ను పరిశీలించుకోవాలనీ, డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వర్షంలో ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేయడం, అకస్మాత్తుగా సడన్‌ బ్రేక్‌ వేయడం వంటివి చేయోద్దని చెప్పారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఒంటిచేత్తో డ్రైవింగ్‌ చేయోద్దని హెచ్చరించారు.
అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణీకులకు సురక్షిత రవాణాను అందించాల్సిన బాధ్యత డ్రైవర్లదేనని తెలిపారు.
శ్రీశైలంకు ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీ
ప్రముఖ దర్శనీయప్రాంతం శ్రీశైలం వెళ్లే యాత్రీకుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అమల్లోకి తెస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ప్రతి వారాంతాల్లో సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టేషన్‌ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామన్నారు. రెండ్రోజుల ఈ టూర్‌ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి, సాక్షి గణపతి, పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570 టిక్కెట్‌ ధరగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుందనీ, హైదరాబాద్‌లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరి, 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హౌటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హౌటల్‌లో బస ఉంటుంది.
రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హౌటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాలని తెలిపారు. ”హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నట్టు వివరించారు. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.in లో చూడవచ్చు. ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు