ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులకు మెరిట్‌ జాబితా విడుదల

– 9,192 మంది ఎంపిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయం, వైద్య విద్య, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టులకు సంబంధించిన మెరిట్‌ జాబితా విడుదలైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 325 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి 2017, డిసెంబర్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. 11,984 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 9,192 మంది పరీక్ష రాశారని, వారంతా మెరిట్‌ జాబితాకు ఎంపికయ్యారని వివరించారు. అర్హతలు, వెయిటేజీ, సర్వీసు వెయిటేజీకి సంబంధించిన మార్కులపై అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 19 నుంచి 27 వరకు అభ్యంతరాలను స్వీకరించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మార్కులను పొందుపరిచా మని స్పష్టం చేశారు. అనంతరం ప్రస్తుత నిబంధనల ప్రకారమే జనరల్‌ ర్యాంకుల జాబితాను రూపొందించామని తెలిపారు. వివరాలకు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love