కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన

– ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
న్యూఢిల్లీ : కార్మిక, కర్షక, కష్టజీవులపై భారాల మోపుతున్న మోడీ విధానాలను ప్రతిఘటించటానికి ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీకి తరలిరావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ పిలుపునిచ్చా రు. పంజాబ్‌లోని జలంధర్‌లో ప్రజా పోరాటాల యోధుడు హరి కిషన్‌ సింగ్‌ సూర్జీత్‌ ఫోటోతో ముద్రించిన టీషర్ట్‌లను చలో ఢిల్లీ ప్రచార ఉద్యమం లో భాగంగా ఆయన ఆవిష్కరించారు. ఆ టీ షర్ట్‌ల తో చలో ఢిల్లీకి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున కష్టజీవులు తరలిరానున్నారని వెంకట్‌ తెలిపారు. వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది 33శాతం నిధులు తగ్గించిందని అన్నారు. దీనివల్ల వేతనాలు రాక కూలీలు పనులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కూలీలు పనులకు రావటం లేదనే కారణంతో ఉపాధి చట్టాన్ని కనుమరుగు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారనీ, ఈ విధానాలను ప్రతిఘటిస్తూ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ ర్యాలీ ఏప్రిల్‌ 5న ఢిల్లీలో లక్షలాది మందితో జరుగుతుందని ఆయన తెలిపారు.

Spread the love