రిషి సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్రిటన్‌లో రిషి సునాక్‌ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైంది. కుంభకోణాలు, అధిక ద్రవ్యోల్బణంతో కన్జర్వేటివ్‌ పార్టీ రెండు స్థానాల్లో మెజారిటీని కోల్పోయింది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే-అయిన్‌స్టీ సీటులో లేబర్‌ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. మరో స్థానమైన సోమర్టన్‌-ఫ్రోమ్‌ను లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ గెలుచుకొంది. కన్జర్వేటివ్‌ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్‌-సౌత్‌ రూయిస్లిప్‌ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గెలిచిన స్థానం. ఇటీవల ఆయన ఎంపి పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ స్థానంలో మాత్రం అధికార పార్టీ గతంలో కంటే బలపడింది. ఈ ఫలితాలతో రిషి సునాక్‌ నాయకత్వంపై ఒత్తిడి పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీకి సవాళ్లు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. రిషి సునాక్‌ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో పార్టీలోని పలువురు నేతలు వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం ఆయన ప్రాభవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలతో వచ్చే సాధారణ ఎన్నికల్లో కెయిర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ నుండి అధికార పార్టీకి గట్టిపోటీ తప్పదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Spread the love