ఉపాధ్యాయుల సర్దుబాటులో నిబంధనలను పాటించాలి

నవ తెలంగాణ-కంటేశ్వర్

ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో సర్ ప్లస్ ఉపాధ్యాయులను ఆవసరమున్న పాఠశాలకు నిబంధన మేరకు మండల పరిధిలో సర్దుబాటు చేయాలని, అట్టి జాబితాలను ప్రకటించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేస్తూ జిల్లా అధ్యక్షులు బాలయ్య ప్రధాన కార్యదర్శి రాజన్నలు గురువారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినవి, అనేక మండలాలలో సర్ ప్లస్ ను అవసరమున్న పాఠశాలలకు అడ్జస్ట్ చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా సుదూర మండలాలకు అక్రమంగా డిప్యూటేషన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు ఉపాధ్యాయులు ఎటువంటి డిప్యూటేషన్ ఉత్తర్వులు లేకపోయినా డివిజన్లు దాటి తమకు నచ్చిన పాఠశాలలో పనిచేస్తే అట్టి ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారులు వేతనాలను నిలిపివేయక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి నెల నెల వేతనాలు చెల్లించి అక్రమాలకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పై అక్రమాలు జరగకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అయినప్పటికీ అక్రమాలు కొనసాగితే అందుకు జిల్లా విద్యాశాఖనే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం.