కోల్‌ ఇండియాలో వాటాల విక్రయం

– కేంద్ర ఖజానాకు రూ.4వేల కోట్లుపైనే
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, నవరత్న కంపెనీ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌)లో మోడీ ప్రభుత్వం మరోసారి వాటాలను విక్రయించింది. తాజాగా మూడు శాతం వాటాను మార్కెట్‌ శక్తులకు కట్టబెట్టింది. దీంతో రూ.4,000 కోట్ల పైనే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరింది. సిఐఎల్‌లో వాటాల అమ్మకంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల్లో తొలి వాటాల ఉపసంహరణ చేసినట్లయ్యింది. రెండు రోజుల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌)లో ప్రభుత్వం కోల్‌ ఇండియాలో తన 3 శాతం వాటాకు సమానమయ్యే 18.48 కోట్ల షేర్లను విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.225కు అమ్మకానికి పెట్టింది. సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం 28.76 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలు చేయగా, శుక్రవారం రిటైల్‌ కొనుగోలుదారులు 2.58 కోట్ల షేర్లకు, సంస్థాగత బిడ్డర్లు మరో 5.12 కోట్ల షేర్లకు బిడ్లు వేశారు. దీంతో కోల్‌ ఇండియాలో ప్రభుత్వ వాటా 66.13 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల్లో రూ.51,000 కోట్ల విలువ చేసే వాటాలను ప్రయివేటు శక్తులకు విక్రయించాలని మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం బిఎస్‌ఇలో కోల్‌ ఇండియా షేర్‌ 0.15 శాతం పెరిగి రూ.230.90 వద్ద ముగిసింది.

Spread the love