సెన్సెక్స్‌ ఏ67వేలు

– 20 వేల చేరువలో నిఫ్టీ
– పిఎస్‌బి షేర్ల మద్దతు
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో పరుగులు పెడుతున్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారి 67వేల మార్క్‌ను దాటింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 20వేల చేరువలో నమోదయ్యింది. లాభాల్లో సాగుతున్న అమెరికన్‌ మార్కెట్ల విశ్వాసంతో బుధవారం భారత మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు చోటు చేసుకుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మద్దతుతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 302 పాయింట్లు లేదా 0.45 శాతం పెరిగి 67,097కి చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 84 పాయింట్లు లేదా 0.42 శాతం లాభపడి 19,833 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా ఈ సూచీలు ఏకంగా 67,171, 19,892కి చేరి మరో నూతన రికార్డ్‌ను సృష్టించాయి. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సూచీ 2 శాతం ర్యాలీ చేసింది. ఆ తర్వాత మీడియా ఒక్క శాతం పెరగ్గా, ఐటి సూచీ యథాతథంగా నమోదయ్యింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.09గా ఉంది. సెన్సెక్స్‌-30లో ఎన్‌టిపిసి, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు టిసిఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతి సుజుకి, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్ట్లే ఇండియా షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.