సారూ.. మాకు న్యాయం చేయండి..

– ఓయూ దైరతుల్‌ మారిఫిల్‌లో ఆర్డర్‌ కాపీ లేదన్న కారణంగా ఉద్యోగం నుంచి ఐదుగురి తొలిగింపు
– సర్క్యులర్‌ జారీ చేశాం..
– ఆర్డర్‌ కాపీలు ఇవ్వాలంటూ మూడు సార్లు సర్క్యులర్‌ పంపించాం దానిపై వారు సంతకాలు చేయలేదు.
– ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల నిర్ణయం మేరకు వారిని తొలగించాం.

దైరతుల్‌ మారిఫియల్‌ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌
అంతా మా ఇష్టం… మేం ఎంత చెపితే అంతే
గతంలో వేటుపడిన వారే ఇప్పుడు రిజిస్ట్రార్‌కు మాయమాటలు చెప్పి అంతా వారి ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గతంలో ఓ మహిళ ఈ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో (మూడున్నరేండ్ల కిందట) అందులో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను తొలగించినట్టు బాధితులు తెలిపారు. అయితే, సదరు మహిళా డైరెక్టర్‌ పదవీ విరమణ చేయడంతో గతేడాది మార్చిలో తిరిగి ఆ నలుగురు ఉద్యోగం సంపాదించుకున్నట్టు తెలిసింది. ఉద్యోగం కోల్పోయిన సమయంలో నలుగురి వేతనం రూ.38వేలు వస్తుండేదని, తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత వారికి రూ.72వేలు వస్తున్నదని, ఉన్న మా ఉద్యోగాలు తీసేశారని బాధితులు వాపోయారు.
 ఆర్డర్‌ కాపీ చూపించినా, కోర్టు అనుమతులున్నా బేఖాతర్‌
తెలిసిన వారినల్లా కాళ్లుపట్టుకున్నా ఫలితం శూన్యం
 ఎలాంటి బెన్‌ఫిట్స్‌ అందకుండానే ఒకరి ఉద్యోగ విరమణ
నవతెలంగాణ- సిటీబ్యూరో
గవర్నమెంట్‌ ఉద్యోగం.. ఒకటి కాదు, రెండు కాదు, ఆ సంస్థతో 39 ఏండ్ల అనుబంధం.. జీవిత చరమాంకం.. నాలుగైదు ఏండ్లయితే ఉద్యోగ విరమణ.. ఇలాంటి సమయంలోనే పిడుగులాంటి వార్త. మీ నియామక పత్రాలు తేవాలంటూ డైరెక్టర్‌ హుకుం.. అవి సంస్థ దగ్గరే ఉన్నాయని నెత్తీనోరూ బాదుకున్నా వినలే.. నెలలు తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పత్రాలు సాధించినా కనికరించలే.. 39 ఏండ్ల నుంచి పని చేస్తున్న వాళ్లు కాబట్టి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పినా జాంతానై అంటూ వారి స్థానంలో నచ్చినోళ్లను నియమించుకున్నారు. దాంతో 11నెలలుగా వారికి ఉద్యోగం లేదు.. వేతనాలు లేవు.. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేక ఇండ్లు గడవడమే భారంగా మారింది. పిల్లల ఫీజులు చెల్లించలేక ఇంటికే పరిమితం చేశారు. అద్దెలు చెల్లించలేక, యజమానులకు సమాధానం చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదు.. ఇది ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలోని దైరతుల్‌ మారిఫిల్‌ సంస్థలో జరుగుతున్న తతంగం. అసలు ఆ సంస్థలో ఏం జరుగుతుంది? ఉద్యోగుల ఇక్కట్లు ఏంటి? బాధిత ఉద్యోగుల చెప్పిన విషయాలపై ‘నవ తెలంగాణ’ కథనం.
దైరతుల్‌ మారిఫిల్‌లో..
దైరతుల్‌ మారిఫిల్‌లో నిధులు గోల్‌మాలైన ఘటన కొద్ది రోజుల కిందట వెలుగులోకి వచ్చి సంచలనం రేపింది. దైరతుల్‌ మారిఫిల్‌ సంస్థ ఓయూ క్యాంపస్‌లోనే ఉన్నప్పటికీ ఒక మత సంస్థ నుంచి కేటాయించే ప్రత్యేక నిధులతో కొనసాగుతోంది. దీనికి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి, చైర్మెన్‌గా ఓయూ వీసీ కొనసాగుతున్నారు. మైనార్టీ సంస్థ నుంచి ఒకరు డైరెక్టర్‌గా నియా మకం అవుతారు. అయితే దీనికి ప్రస్తుతం ఓయూ రిజిస్ట్రార్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా కొనసాగు తున్నారు. ఇందులో ప్రముఖ తెలుగు(ఆథ్యాత్మిక) గ్రంథాలను అరబిక్‌, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో అను వధించి (ట్రాన్స్‌లేట్‌) ముద్రిస్తారు. వాటిని భారత్‌తోపాటు ఇతర దేశాలకు సరఫరా చేస్తారు.
ఆర్డర్‌ కాపీ లేదని..
దైరతుల్‌ మారిఫిల్‌లో 1984లో మహమ్మద్‌ అబ్దుల్‌ వాహబ్‌ బైండర్‌కమ్‌ అటెండర్‌గా చేరాడు. అదే సంవత్సరం మహమ్మద్‌ అన్వర్‌, 1981లో మహమ్మద్‌ అలీ బైండర్‌ కమ్‌ అటెండర్‌గా, ఆ తర్వాత అబ్దుల్‌ రెహెమాన్‌ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరారు. సయ్యద్‌ జావీద్‌ అలీ 2005లో(కాంట్రాక్టు పద్ధతిలో) బైండర్‌ కమ్‌ అటెండర్‌గా చేరారు. దాదాపు 39 ఏండ్ల కిందట ఉద్యోగంలో చేరిన వారికి అధికారికంగా ఆర్డర్‌ కాపీలు జారీ చేశారు. మొత్తం ఆరుగురు కాగా ఒకరు ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. మిగిలిన వారిలో సయ్యద్‌ జావీద్‌ అలీ 2005లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం సంపాదించుకుని కొనసాగుతున్నారు. మిగతా నలుగురు పర్మినెంట్‌ ఉద్యోగులు. ఇదిలావుండగా కొద్ది నెలల కిందట వీరికి ఉన్నతాధికారులు ఉద్యోగ నియామకపు (ఆర్డర్‌ కాపీ) పత్రాలు సమర్పించాలని నోటీసులిచ్చారు. అయితే తమ వద్ద ఆర్డర్‌ కాపీలు లేవని, అవి దైరతుల్‌ మారిఫియా కార్యాలయంలోనే ఉన్నాయంటూ ఆ ఉద్యోగులు అధికారులకు సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహించిన అధికారి ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే, కేవలం సర్క్యులర్‌తోనే ఆరుగురిని గతేడాది ఆగస్టులో ఉద్యోగం నుంచి తొలగించారు. కొద్ది రోజుల తర్వాత ఆర్డర్‌ కాపీలను సంపాదించామని, అన్ని అర్హతలతోనే 39ఏండ్ల కిందట అపాయింట్‌మెంట్‌ అయ్యామని పత్రాలను అధికారులకు సమర్పించినట్టు బాధితులు తెలిపారు.
వాటిని పరిశీలించిన సదరు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ వారిని పనిలోకి తీసుకోవాలంటూ కింది స్థాయి అధికారులకు సూచించారు. అయినా అక్కడ పనిచేస్తున్న (పాత డైరెక్టర్‌ ఉన్న సమయంలో ఉద్యోగం కోల్పోయి, కొద్ది నెలల కిందట తిరిగి ఉద్యోగంలో చేరిన వారు) వారు పట్టించుకోవడం లేదు.
బాధితులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుకూలంగా ఆదేశాలిచ్చినా వారు బేఖాతర్‌ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల కిందట ఉద్యోగం కోల్పోయి మళ్లీ వచ్చిన వారు కావాలని తమను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్‌ సైతం వారు చెప్పినట్టు వింటారంటూ, వారు తమను బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఆరుగురి బాధితుల్లో ఒకరు కొద్ది రోజుల కిందట పదవీ విరమణ చేసినా అతనికి ఎలాంటి బెన్‌ఫిట్స్‌ అందలేదు. 11నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఇల్లు గడవడమే భారంగా మారిందన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Spread the love