అవస్థల ఉపాధి

కనీస వసతులు కరువు రోజు కూలి రూ.70 మాత్రమే
ఎంపిడిఓ కార్యాలయం ముందు ఉపాధి కూలీల ఆందోళన
నవతెలంగాణ-మల్హర్‌రావు.
వలసల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూలీలు మండిపడుతున్నారు.పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు అనేక అవస్థలు పడుతున్నారు.కూలీల సేద తీరేందుకు టెంట్లు,దప్పిక తీర్చడానికి తాగునీరు,ప్రథమ చికిత్స నిమిత్తం మెడికల్‌ కిట్లు లేవని, అన్నింటికొర్చుకొని మండుటెండలో పనిచేస్తే ప్రభుత్వం అందుచే సకాలంలో అందకపోగా,రోజువారీ కూలి రూ.70 మాత్రమే పడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం రోజుకు రూ.272, వారానికి రూ.1600 ఇప్పిస్తాని, వారానికి రూ.450, రోజుకు రూ.70 మాత్రమే ఇస్తూ అధికారులు తమను మోసం చేశారంటూ శనివారం తాడిచెర్లలో ఎంపిడిఓ కార్యాలయం ముందు ఉపాది కూలీలు నిరసన, ఆందోళన చేపట్టారు.
వారానికి రూ.450 మాత్రమే.
అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం మండుతున్న ఎండల్లో సైతం అడవుల్లో కందకాలు,చెరువుల్లో బంటాలు తమ పారలు, గడ్డపారలు తీసుకెళ్లి తవ్వుతున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వం అందించే కనీస వేతనం రావడం లేదని, వారానికి కేవలం రూ.450 నుంచి రూ.650 మాత్రమే వస్తోందని ఉపాధిహామీ కూలీలు ఆందోళన చెందుతున్నారు.స్థానిక పిల్డ్‌ అసిస్టెంట్‌, టెక్నీకల్‌ అసిస్టెంట్‌ బినామీలతో (పనికిరాని వాళ్లతో) కుమ్మకై 50 మంది కూలీలు పనిచేస్తే మరో 50 మంది బినామీ పేర్లను అదనంగా రాస్తున్నారని ఆరోపించారు. దీంతో తమకు నష్టం జరుగుతుందన్నారు.వారం రోజులు పనిచేస్తే ట్రాక్టర్‌ కిరాయికి రూ.200 పోను రూ.450 మాత్రమే మిగలడంతో రోజుకు రూ.70 మాత్రమే పడుతున్న పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలి.
పని ప్రదేశంలో సంబంధించిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి,రోజువారీ కూలీల రికార్డులను తనిఖీ చేయాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. తనిఖీల్లో బినామీలు బయటపడే అవకాశం ఉందన్నారు.బినామిలకు సహకరిస్తున్న ఉపాది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.

Spread the love