19 నుంచి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో స్లైడింగ్‌

28 వరకు స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా సీట్లు కేటాయించిన అభ్యర్థులకు మంగళవారం వరకు రిపోర్టు చేసేందుకు గడువున్నది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19, 20 తేదీల్లో కాలేజీల్లో అంతర్గత బ్రాంచీల మార్పు (స్లైడింగ్‌)నకు అవకాశముందని తెలిపారు. ఆ సీట్ల మార్పునకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈనెల 23న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈనెల 24 వరకు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు అవకాశముందని వివరించారు. ఈనెల 28 వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అయితే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకుంటేనే అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అయితే స్పాట్‌ అడ్మిషన్లలో ప్రవేశం పొందే అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తించబోదని స్పష్టం చేశారు.

Spread the love