జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ‘స్మార్ట్‌’ కాపీయింగ్‌

– హైదరాబాద్‌లో పట్టుబడిన నలుగురు విద్యార్థులు
నవతెలంగాణ-కంటోన్మెంట్‌, హయత్‌నగర్‌
ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ‘స్మార్ట్‌’ కాపీయింగ్‌ చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్‌సీలో జరిగిన పేపర్‌ లీకేజీ వ్యవహారం ఇంకా మరువక ముందే నలుగురు యువకులు వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్‌ కాపీయింగ్‌కు పాల్పడటం హైదరాబాద్‌లో సంచలనం రేపింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నలుగురు యువకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్‌ పోలీసులు, ఎల్బీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలు జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే మాదాపూర్‌ నారాయణ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. చాకచక్యంగా తమ స్మార్ట్‌ ఫోన్లతో ఒకరు నాచారం, మరొకరు ఎల్‌బీనగర్‌, మిగిలిన ఇద్దరు మౌలాలీ, సికింద్రాబాద్‌లోని పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. కడప జిల్లాకు చెందిన చింతపల్లి చైతన్య కృష్ణ సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లోని ఎన్‌వీఐటీ కాలేజీలో పరీక్ష రాశాడు. గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాలను స్క్రీన్‌ షాట్‌ తీసి వాట్సాప్‌ గ్రూప్‌లో స్నేహితులకు పోస్ట్‌ చేశాడు. ఎల్బీనగర్‌, మల్లాపూర్‌, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా విద్యార్థులు ఆ సమాధానాలను కాపీ చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ పరీక్షా కేంద్రంలో అనుమానం కలిగిన ఇన్విజిలేటర్‌.. చైతన్య కృష్ణను పట్టుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యార్థిని తనిఖీ చేయగా ఇన్విజిలేటర్‌, అబ్జార్వర్లు అతని వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్‌ లభించింది. దాంతో మార్కెట్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఎల్బీనగర్‌లో సైతం విద్యార్థిని అరెస్టు చేసిన పోలీసులు, వారిచ్చిన సమాచారంతో మిగతా విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థులపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసునమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Spread the love