కంపు కొడుతున్న గ్రామాలు

– ఎక్కడ చెత్త అక్కడే సాఫీగా సాగాని డ్రయినేజీ
– ఇంటింటికీ అందని తాగునీరు ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకోని పాలకవర్గం, అధికారులు
– సమ్మెలో పంచాయతీ వర్కర్లు
నవతెలంగాణ-యాచారం
17 రోజులుగా పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో గ్రామాలన్నీ కంపు కొడుతున్నాయి. చెత్తను సేకరించేవారు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తతో దర్శనమిస్తున్నాయి. పేరుకుపోయిన చెత్తతో వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తాగునీరు అందడం లేదని దీంతో అనేక అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండడంతో డ్రయినేజీ సాఫీగా సాగక కంపు కొడుతోంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసేందుకు పాలకవర్గాలు, అధి కారులు మాత్రం నానా తంటాలు పడుతున్నారు. ఈ పనులు చేయడానికి డబ్బులు ఇస్తామన్నా, ఎవరు ముందుకు రావడం లేదని పంచాయతీ కార్యద ర్శులు అంటున్నారు. పారిశుధ్య పనులను కొన్నిచోట్ల ప్రయివేట్‌ వ్యక్తులతో చేయిస్తున్నారు. అయినా కూడా పేరుకుపోయిన చెత్తతో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న పనులు చేయడానికి ఎవరు ముందుకు రాక పాలకవర్గం, అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకుపోయిన చెత్తతో వచ్చే వాసన భరించలేక రోగా లకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ వర్కర్ల సమ్మెను విరమింపజేయాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.