విద్యారుణాలు కావలెను !

– ‘విదేశీ విద్యానిధి’ పథకానికి భారీ డిమాండ్‌
– ఇప్పటిదాకా రూ.947.08 కోట్లు ఖర్చు
– మహిళలకూ అవకాశం
– బీసీల్లో పోటీ ఎక్కువ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
చదువు…మానవజీవితంలో విడదీయరాని కీలక అంశం. అది లేనిదే ప్రపంచాన్ని తెలుసుకోలేం. అసలు జీవితమే లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ‘విద్య లేనివాడు వింత పశువు’ అనే నానుడి మనకందరికీ గుర్తొస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో చదువుకున్న ప్రాధాన్యత అలాంటిది మరి. అందునా ఉన్నత విద్య సంగతి చెప్పక్కర్లేదు. అందుకే అన్నారు నెల్సన్‌ మండేలా ‘ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే’నని. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఒక కల. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘విదేశీ విద్యానిధి’కి శ్రీకారం చుట్టింది. గులాబీ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు అమల్లోకి వచ్చింది. ఈ పథకంతో ప్రస్తుతం మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. అవసరమైన మేరకు నిధులు అందుబాటులో లేకపోవడంతో ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వెనుకబడిన తరగతుల(బీసీ) కోటా పెంచాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది. ఈ పరిస్థితుల్లో రుణం పొందే అవకాశం లేక ప్రతిభ ఉన్న ఆయా తరగతుల పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు.
అసలు పథకం ఏంటీ ?
రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో విదేశీ విద్యానిధి పథకానికి ఉనికిలోకి తెచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఉన్నత విద్యను విదేశాల్లో చదివేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్‌ పేరిట, బీసీలకు జ్యోతిబా ఫూలే, మైనార్టీలకు సీఎం ఓవర్‌సీస్‌, బ్రాహ్మణులకు వివేకానంద పేరిట ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. విదేశాల్లో ఆయా కోర్సుల్లో చేరేందుకు రూ. 20 లక్షలు రుణాన్ని మంజూరుచేస్తుంది. రుణంతోపాటు వీసా, విమాన టికెట్‌, కొంత నగదును అందించే పథకమిది. లబ్ధిదారుల కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు ఉండాలి. కుటుంబంలో ఒకరికే ఈ రుణం వస్తుంది. దరఖాస్తు చేసే సమయానికి విద్యార్థి వయస్సు రూ.35 ఏండ్లు దాటకూడదు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జీఆర్‌ఈ, జీమాట్‌,టోఫెల్‌, ఇంగ్లీష్‌ టెస్ట్‌లో అర్హత సాధించాలి. ఎంపికైన విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొందిన వారికి మాత్రమే రుణం అందుతుంది. అర్హత కలిగి ఎంపికైన విద్యార్థులకు రూ. 10 లక్షల చొప్పున రెండు విడతలుగా రూ.20 లక్షలు రుణం కింద ఇస్తారు.
పది దేశాల్లో..
అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిల్యాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కోరియా దేశాల్లో మాస్టర్స్‌, పీజీ, పీహెచ్‌డీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు విదేశీ విద్యానిధి పథకానికి అర్హులు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని వేలాది మంది విద్యార్థులు లబ్ధిపొందారు. చదువుపూర్తిచేసి ఉద్యోగాలు సైతం పొంది తమ తమ జీవితాల్లో స్థిరపడుతున్నారు. భవిష్యత్‌కు బంగారు బాట వేసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మంచిదే అయినా, ఎక్కువ మంది విద్యార్థులకు అందడం లేదు. దీంతో ప్రతిభ ఉండి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. ఎస్సీల్లో కొంత పరవాలేకున్నా, ఎస్టీల్లో విద్యార్థులు తక్కువగా దరఖాస్తు చేస్తున్నారు. ఈ రెండు తరగతులకు 300 మంది చొప్పున అవకాశమిస్తారు. బీసీలకూ అంతే. మహిళలకు రుణాల్లో 30 శాతం ఇస్తున్నారు. అయితే బీసీల్లో పోటీ ఎక్కువగా ఉంటున్నది. ఉన్న కోటా కంటే అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. సాధారణంగా ప్రతియేటా 300 మందికి అవకాశం ఉంటే, 700 నుంచి 800 మంది విద్యార్థుల దాకా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పథకం అందరికీ అందకుండా పోతున్నది. ఈనేపథ్యంలో బీసీల కోటా పెంచాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది.కాగా 2016 నుంచి గత ఏడాది వరకు సుమారు 6701 మందికి రూ.947.08 కోట్లు విద్యా రుణాల కింద ప్రభుత్వం మంజూరు చేసింది. సాధారణంగా జనవరి, ఆగస్టులో విదేశాలకు విద్యార్థులు వెళుతూ ఉంటారు. కాగా ఎక్కువ మంది విద్యార్థులకు రుణాలు అందేలా పథకంలో మార్పులు చేయాలనే డిమాండ్‌ పెరుగుతున్నది. అలాగే ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తం రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచాలనే విజ్ఞప్తులూ వస్తున్నాయి.
రుణం పెంచాలి
విద్యారుణాన్ని రూ. 20 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాయితీలు వర్తిస్తున్నాయి. కొంత పరవాలేదు. కానీ బీసీ విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. రుణాల మంజూరులో బీసీ సంక్షేమ శాఖ అలసత్వం ప్రదర్శిస్తున్నది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకూ సమస్యలు తప్పడం లేదు. కన్సెల్టెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాటి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.
టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి

Spread the love