ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు

– కేంద్రం, తెలంగాణ సీఎంకు నోటీసులు అవసరం లేదు
న్యూఢిల్లీ : ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సీబీఐతో సహా 15 మంది ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అలాగే ప్రతివాదుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ సీఎంకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొంది. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌ను రద్దు చేస్తూ, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీపీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే ఇటీవల కోర్టు ఆదేశాలకు సంబంధించిన నోటీసులను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, తెలంగాణ పోలీసులతో కూడిన సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తుందా? అని ప్రశ్నించారు. ఇందుకు దవే బదులిస్తూ సిట్‌ దర్యాప్తును నిలిపివేసిందన్నారు. కేసులో తెలంగాణ సీఎం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల అంశాన్ని దవే ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకొని ‘కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? అవసరమే లేదు’ అని పేర్కొన్నారు. తెలంగాణ సీఎంకు కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి, అలాగే ఈ కేసులో మిగిలిన 14 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎమ్మెల్యేల ఎర కేసులో మొత్తం 17 మంది ప్రతివాదులు ఉన్నారు. ఇందులో రెండో నెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం, 17వ నెంబర్‌లో తెలంగాణ సీఎం పేర్లు ఉన్నాయి. మిగిలిన జాబితాలో బీజేపీ, సీబీఐ, తెలంగాణ స్టేట్‌, తెలంగాణ డీజీపీ, సీపీ, మొయినాబాద్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌, రామచంద్ర భారతి, నందు కుమార్‌, తుషార్‌ వెల్లంపల్లి, సింహయాజీ, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌, సిట్‌ సభ్యులు రేమ రాజేశ్వరి, కమలేశ్వర్‌లు ఉన్నారు. వీరందరికీ సర్వోన్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. కాగా ఈ పిటిషన్‌ను ఈ నెల 13న విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించకూడదని స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 31 వరకు వాయిదా వేసింది. అయితే ఇందుకు తగ్గట్టుగా ఆదేశాలు వెలువడకపోవడంతో నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Spread the love