బాలికపై రెండేళ్లుగా స్వామీజీ లైంగికదాడి!

నవతెలంగాణ – రాజమండ్రి: అనాథ మైనర్‌ బాలికకు అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్‌ వేల్ఫేర్‌ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండకు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో సమీపంలో ఉండే ఒక మహిళ బాలికను ప్రభుత్వ హాస్టల్‌లో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండటంతో బాలికను గత రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకొని జ్ఞానానంద, రామానంద ఆశ్రమం చేర్పించింది. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ బాలికతో పాటు మరో 13 మంది మైనర్‌ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్‌ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. రైలులో విశాఖ నుంచి విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలికను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తమతో పాటు కంకిపాడు తీసుకువెళ్లి కొన్ని రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంచి సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో విజయవాడలోని సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు తెలుసుకుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్రమం పేరుతో మైనర్‌ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలిక చేత దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. విజయవాడ పోలీసుల సమాచారం మేరకు ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమానికి చేరుకొని కీచక స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, దీంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Spread the love