
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం నాందేవ్ వాడలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించిన టోకెన్ సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మూడు వేల రూపాయల వేతనాన్ని జూలై నెల నుండి అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది మధ్యాహ్న భోజన కార్మికుల పోరాట విజయమని అన్నారు. కానీ ఈ యొక్క వేతనాన్ని పెండింగ్ ఏరియాస్ తో సహా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన నాటినుండి చెల్లించాలని డిమాండ్ చేశారు, స్లాబ్ రేటు పెంచే వరకు పాత మెనూ ప్రకారమే వంట చేస్తామని అన్నారు, జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎనిమిది కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల అందరికీ ఇస్తున్నట్టుగానే డ్రెస్ కోడ్ అమలు చేయాలని, కొత్త వంట పాత్రలు, వంట షెడ్లు, ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు, సమస్యల పరిష్కారం కోసం కార్మికులందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, సుజాత, పర్వవ్వ, రజియా బేగం, గంగామణి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.