బ్రిజ్‌ భూషణ్‌కు తాత్కాలిక బెయిలు

– రూ.25 వేల పూచీకత్తుతో ఢిల్లీకోర్టు మంజూరు
– పక్షపాతంగా వ్యవహరిస్తోన్న విచారణ కమిటీ : మహిళా రెజ్లర్లు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు, డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌కు కూడా తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తులతో వీరిద్దరికీ రెండు రోజుల పాటు బెయిల్‌ను అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం) హర్జీత్‌ సింగ్‌ జస్పాల్‌ మంజూరు చేసి, తదుపరి విచారణను జులై 20కి వాయిదా వేశారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో జూన్‌ 15న చార్జిషీటు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడిపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. జులై 18న కోర్టు ముందు హాజరుకావాలని బ్రిజ్‌ భూషణ్‌తో పాటు వినోద్‌ తోమర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే బ్రిజ్‌ భూషణ్‌, వినోద్‌ తోమర్‌లు మంగళవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నిందితులిద్దరూ రెగ్యులర్‌ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తులపై ఈనెల 20న విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 354, 354డి, 345ఎ, 506(1) ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ తమను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించారని, తమ ఛాతీ నుంచి వెనుకవైపు చేతితో తడిమారని ఆరోపించారు. మహిళా రెజ్లర్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లతో చర్చలు జరిపిన అనంతరం పోలీసులు ఈ కేసులో చార్జిషీటును దాఖలు చేశారు.
పక్షపాతంగా వ్యవహరిస్తోన్న విచారణ కమిటీ : మహిళా రెజ్లర్లు
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని మహిళా రెజ్లర్లు ధ్వజమెత్తారు. విచారణ కమిటీ బ్రిజ్‌భూషణ్‌ను రక్షించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌ భూషణ్‌ పట్ల విచారణ కమిటీ పక్షపాతం చూపుతోందని ఫిర్యాదు దారులు ఓ ప్రకటనలో తెలిపారు.
1599 పేజీలతో కూడిన చార్జిషీటులో 44 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. సీఆర్‌పీసీ 164 కింద ఫిర్యాదుదారుల ఆరు వాంగ్మూలాలు కూడా తీసుకుంది. తాను ఫెడరేషన్‌ కార్యాలయా నికి వెళ్లినప్పుడల్లా కమిటీ ముందు తన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా, నిందితులు తన పట్ల గతంలో మాదిరిగానే వ్యవహరించారని ఓ ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తన వాంగ్మూలాన్ని పూర్తిగా రికార్డు చేయలేదని, నిందితుని కాపాడే ఉద్దేశంతో సాక్ష్యాన్ని మార్చే అవకాశం కూడా ఉందని అన్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్యానెల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది కానీ బహి రంగపర్చకపోవడం గమనార్హం.