పదిరెట్లు పెరిగిన ధాన్యం ఉత్పత్తి

ప్రాసెసింగ్‌కు విస్త్రుత అవకాశాలు
సటాకే కంపెనీ ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్‌ చర్చలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పదిరెట్లు ధాన్యం ఉత్పత్తి పెరిగిందనీ, ఫలితంగా మిల్లింగ్‌, ప్రాసెసింగ్‌కు విస్త్రుత అవకాశాలు ఏర్పడ్డాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారంనాడాయన రాష్ట్రంలో మిల్లింగ్‌ పరిశ్రమల స్థాపన కోసం జపాన్‌కు చెందిన సటాకే కార్పోరేషన్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుత సీజన్‌లో 1.30 కోట్ల టన్నుల ధాన్యాన్ని తమ శాఖ సేకరించిందనీ, అదే స్థాయిలో వేగంగా మిల్లింగ్‌ చేస్తూ, ఉప ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే అంశాలపై వారితో చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సటాకే కార్పొరేషన్‌ తమ ఉత్పత్తుల గురించి మంత్రికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌, యూకే, థారులాండ్‌, చైనా, వియాత్నాం తదితర వరి పండించే దేశాల్లో తమ కంపెనీ మిల్లింగ్‌ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. అత్యధికంగా రోజుకు లక్ష టన్నుల వరకూ మిల్లింగ్‌ సామర్థ్యం ఉందన్నారు. నిల్వ సామర్థ్యం, బాయిలర్ల పనితీరు, ఉప ఉత్పత్తులు తదితర అంశాలపై మంత్రి వారితో చర్చించారు. సమావేశంలో ఆ శాఖ కమిషనర్‌ వీ అనిల్‌కుమార్‌, సటాకే కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆర్‌కే బజాజ్‌, ఎజీఎం హెచ్‌ సతీష్‌కుమార్‌, డీలర్లు కే విఠల్‌, కే వినరుకుమార్‌ పాల్గొన్నారు.

Spread the love