రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : తమ్మినేని

– ప్రమాదంలో మరణించినవారికి సంతాపం
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రం బహనాగా రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు సుమారు 300మంది ప్రయాణీకులు మరణించినట్టు, 1000 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తున్నది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ప్రయాణీకులలో సుమారు 170మంది తెలుగు రాష్ట్రాలనుండి ఉన్నారని, కొద్దిమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపట్ల సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నది. మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. రైల్వేల ఆధునీకరణలో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేలాదిమంది ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రైల్వే స్టేషన్ల సొబగుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో రైల్వే లైన్లు, సిగ్నల్స్‌ వ్యవస్ధ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయం. రైల్వేశాఖలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ట్రాక్‌ పర్యవేక్షణ, తదితరాల్లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, గాయపడినవారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రైల్వే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.

Spread the love