కలిసే ముందుకెళ్తాం సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశం నిర్ణయం

– పొత్తుల కోసం వెంపర్లాడం
– బలమున్న నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం
– మా రాజకీయ విధానంలో మార్పులేదు

– కాంగ్రెస్‌తో వెళ్తామన్నది నిరాధార ఆరోపణ
– బీజేపీకి వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే మా లక్ష్యం
– అవసరమైతే ఆ ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహించాలి
– పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు
– 11 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలివ్వాలి : తమ్మినేని, కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘కమ్యూనిస్టులం కలిసే ముందుకు సాగుతాం’. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావైనా, రేవైనా కలిసే ఉండాలని నిర్ణయించాం. అలాగే ముందుకెళ్తాం. కమ్యూనిస్టుల్లేని అసెంబ్లీ, పార్లమెంటు దేవుడు లేని దేవాలయం లాంటిది. ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారు. మా స్ఫూర్తిని, ఐక్యతను ప్రజలు ఆదరించాలి.’అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.
‘కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కలిసుండాలని నిర్ణయించాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ఘనత సీపీఐ, సీపీఐ(ఎం)కు దక్కింది. దానిపై అనేక విమర్శలు వచ్చినా ప్రజలకు, ఇరు పార్టీల కార్యకర్తలకు బీజేపీ ప్రమాదాన్ని వివరించి చెప్పాం. మంచి ఫలితం వచ్చింది. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఎమ్మెల్యేల కొనుగోలుకు ఓ సాధనంగా ఉపయోగపడేది. బీఎల్‌ సంతోష్‌  ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అస్థిరంగా మారే ప్రమాదంలో పడేది. కానీ మునుగోడు ఫలితం తర్వాత మమ్మల్ని విమర్శించిన వారు కూడా హర్షించారు.’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో శుక్రవారం సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కలవేణి శంకర్‌, హేమంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ఊహాగానాలపై నిర్ణయం తీసుకోలేం : తమ్మినేని
అనంతరం మీడియాతో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు ఇటీవల దూరమయ్యారని, కాంగ్రెస్‌తో జతకడతారంటూ ప్రచారం జరిగిందన్నారు. అవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, దాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో పొత్తులు రాజకీయ విధానాల ప్రాతిపదికన ఉంటాయి తప్ప ఓట్లు, సీట్ల ప్రాతిపదిక కాదన్నారు. అఖిల భారత స్థాయిలో బీజేపీని ఓడించడమే తమ రాజకీయ విధానమని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ ఆ విధానమే ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌తో తమ మైత్రి ఆ ప్రాతిపదికనే ఏర్పడిందని, ఇప్పటికీ అది కొనసాగుతున్నదని వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం, ఓట్లు చీలకుండా ఉండేందుకే మునుగోడులో బీఆర్‌ఎస్‌తో స్నేహంగా ఉన్నామని చెప్పారు. మద్దతివ్వాలంటూ కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన వచ్చిందని గుర్తు చేశారు. కానీ బీజేపీని ఓడించే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందని అన్ని కమిటీల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ తర్వాత ఖమ్మం సభలో, ఇతర సభల్లో వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసే ఉంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని అన్నారు. బీజేపీని కేంద్రంలో గద్దెదించేదాకా విశ్రమించేది లేదంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీటీం అంటూ ఊహాగానాలొచ్చాయని, అవి ఆధారాల్లేనివని చెప్పారు. కేంద్ర మంత్రులను కలవడం, కవిత కేసు వంటి విషయాలపై కేటీఆర్‌, కేసీఆర్‌ బహిరంగంగా ప్రకటించారని అన్నారు. అయితే ఊహాగానాల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేయడమే తమ పని అని చెప్పారు. అందులో సీఎం కేసీఆర్‌ ముఖ్యమైన శక్తి అని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగుతుందన్నారు. సీట్ల పంపకం ఉంటుందా? ఎన్ని సీట్లు కోరుకుంటున్నాం, తక్కువ సీట్లకు అంగీకరిస్తారా?, ఇది అవమానకరంటూ వస్తున్న వార్తలపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే సీట్ల పొత్తు ఉండాలనేది ఏం లేదన్నారు. తమకు బలమున్న నియోజకవర్గాల్లో కేంద్రీకరించి పనిచేస్తున్నామని, ప్రజలను సన్నద్ధం చేస్తున్నామని వివరించారు. తాము అనుకున్న సీట్లు గెలవడానికి ఆలోచనలు చేస్తున్నామని అన్నారు.
బీఆర్‌ఎస్‌పై యూటర్న్‌ తీసుకోలేదు : కూనంనేని
పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నాక కార్యదర్శి ఏది పడితే అది మాట్లాడేది ఉండబోదని, ఆ నిర్ణయం మారబోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. నిర్ణయం మారాలంటే కిందిస్థాయి నుంచి మళ్లీ చర్చించాల్సి ఉంటుందన్నారు. అయితే బీఆర్‌ఎస్‌పై యూటర్న్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులు అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాలని అన్నారు. అనేక సమస్యలపై పోరాడుతున్నామని చెప్పారు. సీట్ల కోసం దిగజారాల్సిన అవసరం లేదన్నారు. అయితే రోజుకో పార్టీ మారే వారు తమను విమర్శిస్తున్నారని వివరించారు. కమ్యూనిస్టులను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. బీజేపీని నిలువరించడంలో కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారని చెప్పారు. మునుగోడులో అదే చేశామని అన్నారు. అయితే అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పైనే ఉందన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై ఎక్కువ ఉంటుందని అన్నారు. కేరళలో కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులకు పోటీ ఉంటుందని, అయినా తమిళనాడులో కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి ఉన్నాయని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ అందరూ కలవాల్సిన అవసరముందన్నారు. అయితే తాము పిలుపు కోసం వేచిచూడం, సీట్ల కోసం వెంపర్లాడబోమని, బలమున్న నియోజకవర్గాల్లో తమపని తాము చేసుకుంటూ పోతామని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదన్నారు. నాలుగు లక్షల ఎకరాలకే హక్కు పత్రాలిస్తున్నామని చెప్పారు. సీఎం హామీ ఇచ్చినట్టుగా 11 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలివ్వాలని, గిరిజనేతరులకూ పోడు భూములు ఇవ్వాల్సిన అవసరముందని వివరించారు. ఈ అంశంపై ఓ కార్యక్రమ చేపడతామని, పత్రాలు రానివారు, పేర్లు గల్లంతైన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

Spread the love