నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. దేశం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి భార్య అని తెలిసింది. దీనిపై స్పందించిన ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధం సమయంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ.. ఈ అమానవీయ ఘటన నుంచి మాత్రం తన భార్యను కాపాడుకోలేక పోయానని వాపోయారు. ‘కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది. కుంగుబాటుకు గురిచేస్తోంది’ అని ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ మాజీ సైనికుడు విలపించారు. ‘మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలి’ అని ఆ కార్గిల్ వీరుడు డిమాండ్ చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన.. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా సేవలందించినట్లు సమాచారం.