రసాయన శాస్త్రానికి పీరియాడిక్‌ టేబుల్‌ వెన్నెముక

– దాన్ని తిరిగి చేర్చాలి
– తొలగింపులో హేతుబద్ధత లేదు…: డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కింది తరగతుల్లో రసాయనశాస్త్రం సిలబస్‌లో పీరియాడిక్‌ టేబుల్‌ను తిరిగి చేర్చాలని న్యూసైన్స్‌ కళాశాల రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా ‘కెమిస్ట్రీ సిలబస్‌ నుంచి పీరియాడిక్‌ టేబుల్‌ తొలగింపా?’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీరియాడిక్‌ టేబుల్‌ అనేది… రసాయనశాస్త్రానికి వెన్నుముక లాంటిదని తెలిపారు. సిలబస్‌ తగ్గింపు పేరుతో దాన్ని తొలగించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదని స్పష్టం చేశారు. ఆ తొలగింపునకు ఎన్‌సీఈఆర్టీ ఇచ్చిన వివరణ భావదారిద్య్రంగా ఉందని విమర్శించారు. సిలబస్‌ ఎక్కువా?, తక్కువా? అనే దాని కన్నా దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఇస్తే అది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సులువుగా ఉంటుందని సూచించారు. పాఠ్యపుస్తకాల రచనలో ఎన్‌సీఈఆర్టీ ఢిల్లీ పరిసరాల్లో కేవలం పది మందిని మాత్రమే వినియోగించుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను పక్కన పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయనశాస్త్రంలో పీరియాడిక్‌ టేబుల్‌ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తెలిపారు. సిలబస్‌ తగ్గింపు అంటున్న ఎన్‌సీఈఆర్టీ 2005కు ముందున్న సిలబస్‌లో సగం కూడా ప్రస్తుతం లేదని గుర్తుపెట్టుకోవాలని కోరారు. రసాయనశాస్త్రానికి ప్రాథమికాంశాలైన మూలకాలు తదితర విషయాలను సులభతరంగా అర్థం చేసుకునేందుకు పీరియాడిక్‌ టేబుల్‌ ఉపయోగపడుతున్నదని తెలిపారు. మిలియన్ల పదార్థాల ధర్మాలను గుర్తించుకోవడం కష్టమనీ, వాటి ధర్మాల పోలికల చొప్పున గుంపుల వారీగా వర్గీకరించే శాస్త్రవేత్తల కృషితో వచ్చిందే ఈ పీరియాడిక్‌ టేబుల్‌ అని తెలిపారు. ఇది తప్పనిసరిగా కింది తరగతుల్లో పదే పదే నేర్చుకోవాల్సిన అంశమని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎన్‌సీఈఆర్టీ అనాలోచిత చర్యకు పాల్పడిందన్నారు. ఇప్పటికే దేశం చదువుల్లో వెనకబడిందనీ, ఇలాంటి పరిస్థితే కొనసాగితే… ఆర్థికంగానూ దెబ్బతింటామని హెచ్చరించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇప్పటికీ తెలంగాణ అమలు చేయడం లేదనీ, భవిష్యత్తులోనూ అమలు చేయకపోవచ్చని తెలిపారు.

Spread the love