ప్రధాని మౌనం

– హోంమంత్రి అసమర్థత..పని చేయని సీఎం
– మణిపూర్‌ హింసపై జైరాం రమేశ్‌ విసుర్లు
న్యూఢిల్లీ : మణిపూర్‌ అల్లర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రం ఒకపక్క మండిపోతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారనీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అసమర్థంగా పని చేశారనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేయటం లేదని అన్నారు. మణిపూర్‌లో శాంతి గురించి పలు రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన జాతీయ సమావేశంలో జైరాం రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరిని వినటం ద్వారానే మణిపూర్‌లో నమ్మకాన్ని నెలకొల్పవచ్చని అన్నారు. దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చనీ, మనమైతే ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణమే మార్చాలని ఆయన అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా నిర్దయగా సాయుధ గ్రూపులను నిరాయుధీకరణ చేసి నమ్మకం, సామరస్యం, సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పటానికి ప్రక్రియను మొదలు పెట్టాలని జైరాం రమేశ్‌ సూచించారు.

Spread the love