రాజద్రోహ చట్టం సమర్థనీయం కాదు

– ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి
– లా కమిషన్‌ సిఫారసులు ఆక్షేపణీయం
– ప్రజాస్వామ్యానికి ఇదో గొడ్డలిపెట్టు
– ఒడిశా రైలు ప్రమాదానికి మోడీదే నైతిక బాధ్యత : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– ఇప్పటికైనా రైల్వే ప్రయివేటీకరణ ఆపాలి: సీపీఐ(ఎం) నేత పి. సుదర్శన్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాజద్రోహం చట్టం రూపంలోకి తీసుకురావాలని, దానికి మరిన్ని కోరలు పెట్టి దండనీయ నేరంగా కఠిన శిక్షలు అమలు చేయాలని లా కమిషన్‌ చేసిన సిఫారసులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వ ఆలోచనలతో విభేదించడాన్ని రాజద్రోహంగా పరిగణించడమనే సంప్రదాయం మధ్యయుగాల నాటి క్రూరమైన అణచివేతకు నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్‌ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22వ లా కమిషన్‌ సిఫారసు చేసిన సెడిషన్‌ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐపీసీ 124 ఏ సెక్షన్‌ రద్దు చేస్తూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. లా కమిషన్‌ చేసిన ఈ సిఫారసుల సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైనదన్నారు. బ్రిటీష్‌ వలస పాలకులు భారతీయులను అణచివేయడం కోసం, వారి ప్రజాస్వామ్య ఆకాంక్షలను అణగదొక్కడం కోసం తెచ్చిన రాజద్రోహం చట్టాన్ని లా కమిషన్‌ ఏ విధంగా సమర్థిస్తుందని ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం దేశ ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులను ఈ విధమైన సిఫారుసులు హరించి వేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుదర్శన్‌ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇటీవల భారత రైల్వేలో కవచ్‌ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అరికట్టనున్నామని ఘనంగా ప్రకటించిన మోడీ, ఇప్పుడు ఈ ప్రమాదానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కవచ్‌ పరిజ్ఞానాన్ని రైల్వే స్టేషన్లు, రైల్వేల్లో ఎందుకు అమలు చేయలేదన్నారు. ప్రయివేటీకరణ పెరిగితే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, ప్రయివేటు వ్యక్తులు ఆర్థిక విషయాలతో ముడిపెట్టి ఉద్యోగుల సంఖ్యను క్రమేపీ తగ్గించడంతో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తగ్గుతుందన్నారు. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ కరువవుతుందని తెలిపారు.
దశాబ్ద కాలంలో ఇంతటి ఘోర ప్రమాదం జరగలేదని అన్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం.. వందలాది మంది ప్రాణాలను బలిగొందన్నారు. దీన్ని ఒక హెచ్చరికలా భావించి ఇప్పటికైనా రైల్వే ప్రయివేటీకరణను కేంద్రం నిలుపుదల చేయాలని సూచించారు. మృతి చెందిన వారికి రూ.కోటి, గాయపడిన వారికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బండి రమేష్‌, చింతలచెర్వు కోటేశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love