అటకెక్కిన ఎంబీసీ కార్పొరేషన్‌..

– ఆరంభంలో హంగామా…  తర్వాత నిస్తేజం
– ఏడాదికి వెయ్యి కోట్లు అని ప్రకటించినా.. కార్పొరేషన్‌ ఏర్పాటు సరే..
ఎంబీసీ కార్పొరేషన్‌ను ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ ఛైర్మెన్‌గా తాడూరి శ్రీనివాస్‌ను నియమించింది. కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు అధికార యంత్రాంగం, విధి విధానాలు ఇలా అన్ని కార్యకలాపాలు మొదలయ్యాయి. కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు 2017-18లోనే ఎంబీసీలకు పథకాలు అమలు చేస్తారని అనుకున్నప్పటికీ అవేమీ జరగలేదు.
మంజూరు చేసింది రూ.350 కోట్లే.
రెండేండ్లుగా ఖాళీగా చైర్మెన్‌ పోస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అత్యంత వెనకబడిన కులాల కోసం ఒక కార్పొరేషన్‌.. దానికి ఒక చైర్మెన్‌.. వేల కొట్ల నిధుల కేటాయింపు.. ఇదంతా విని కుల వృత్తులకు మంచి రోజులొచ్చాయని అంతా అనుకున్నారు. కానీ వాస్తం మరోలా ఉంది. ‘రాష్ట్రంలో అత్యంత వెనకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సుమారు ఐదేండ్లు దాటుతున్నా.. లబ్దిదారులకు ఆశించిన స్థాయిలో ఒరిగిందేమీ లేదు. ఎంబీసీ చైర్మెన్‌కు మాత్రం మూడేండ్లు వేతనం చెల్లించారు. మిగిలిన నిధులు ఇతర ప్రభుత్వ పథకాలకు దారి మళ్లించారు. కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవీకాలం ముగియడంతో రెండేండ్లుగా ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి పప్పినప్పుడు ఎంబీసీల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు రెండోసారి అధికారంలోకి వచ్చినా అమలుకు నోచుకోవడం లేదని వెనకబడ్డ కుల, వృత్తి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎంబీసీ నివేదిక ఎటుపాయే..?
స్వయంగా సీఎం కేసీఆర్‌ 2018లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటన చేస్తూ.. బీసీ ఎమ్మెల్యేలతో సమావేశమై ఎంబీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఏ పథకాలు వారి అభివృద్ధికి లబ్ది చేకూరుస్తాయి? ఇలా అనేక అంశాలపై చర్చించి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. తర్వాత అప్పటి మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న టీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్యే కె. లక్ష్మణ్‌, ఆర్‌ కృష్ణయ్య తదితరులు రెండు రోజులపాటు సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత అప్పటి మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన మంత్రులు జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమావేశమయ్యారు. ప్రతిపాదనలపై చర్చించి వాటికి తుదిరూపు ఇచ్చి ఎంబీసీ నివేదిక రూపొందించారు. ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నివేదిక గురించి ఊసే లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎంబీసీ కార్పొరేషన్‌ ఒకటుందనే విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదని వెనుకబడిన కుల సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఆ కార్పొరేషన్‌ కార్యాలయాలు మట్టికొట్టుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనకు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలతో జరిగిన ప్రత్యేక సమావేశాలకు అర్థం లేకుండా పోయిందంటూ విమర్శలు చేస్తున్నారు.
మొదటి మూడేండ్లలో రూ.2,400 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు అనంతరం మొదటి మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం సుమారు రూ.2,400 కోట్లు కేటాయించింది. మంజూరు చేసింది మాత్రం కేవలం రూ. 350 కోట్లు మాత్రమే. అందులోనూ కార్పొరేషన్‌ ఖాతాలో జమ అయింది వంద కోట్ల లోపు మాత్రమే. లబ్ధిదారులకు చేరింది కేవలం రూ. 10 కోట్లు లోపే. ఒక 2020-21 బడ్జెట్‌లో బీసీలు, ఎంబీసీలకు కలిపి.. రూ. 500 కోట్లు, 2021-22 బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించినా..వాటి ఖర్చు విషయంలోనూ పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వేలాది మంది కార్పొరేషన్‌ ద్వారా రుణాలకోసం దరఖాస్తులు చేసుకున్నా..వాటికి మోక్షం రావటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కొత్తగా కుల వృత్తులకు రూ.లక్ష సాయమంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు పేరుతో కార్పొరేషన్‌ను అటకెక్కిస్తారేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love