ట్రైలర్‌ శాంపిల్‌ మాత్రమే..

పవన్‌ కళ్యాణ్‌-సాయి ధరమ్‌ తేజ్‌ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా కోసం జీ స్టూడియోస్‌తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్‌ను ఒకేసారి రెండు చోట్ల రిలీజ్‌ చేశారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో, హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సాయి ధరమ్‌ తేజ్‌, కేతిక శర్మ, సముద్రఖని, తమన్‌, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
వైజాగ్‌ జగదాంబ థియేటర్‌లో జరిగిన వేడుకలో సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికీ ట్రైలర్‌ నచ్చడం సంతోషంగా ఉంది’ అన్నారు. ట్రైలర్‌ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుందని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ చెప్పారు. హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో జరిగిన వేడుకలో సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ, ‘చాలా మంచి సినిమా ఇది. సినిమా ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మీరు దేవుడిగా భావించే పవన్‌ కళ్యాణ్‌ దేవుడిగా నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని కథానాయిక కేతిక శర్మ చెప్పారు. ట్రైలర్‌ కేవలం శాంపిల్‌ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు.
ఈనెల 28న ప్రేక్షకుల కోసం వినోదభరితమైన విందు ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో టైటిల్‌ పాత్రధారి(బ్రో)గా పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తుండగా, మార్క్‌ అకా మార్కండేయులుగా సాయి ధరమ్‌ కనిపిస్తారు.

Spread the love