హాయిగా నవ్వుకుంటారు..

శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన సినిమా ‘భాగ్‌ సాలే’. నేహా సోలంకి నాయికగా, ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాతగా బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించారు. ఈనెల 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో హీరో శ్రీసింహా మీడియాతో ముచ్చటించారు.
‘మేం ఏదో సందేశాన్ని ఇవ్వాలని ఈ సినిమాను చేయలేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలని చేశాం. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు వేశాం. అలాగే కాలేజ్‌ స్టూడెంట్స్‌కి, మా ఫ్యామిలీ మెంబర్లకు కూడా చూపించాం. వచ్చిన అందరూ హాయిగా నవ్వుకుని బయటకు వచ్చారు. సినిమా బాగుందని చెప్పారు. దాంతో మాకు ఇంకా నమ్మకం పెరిగింది. అందరినీ ఎంటర్టైన్‌ చేసేలా సినిమా ఉంటుందని, మేం ఊహించే జరిగింది. దర్శకుడు ప్రణీత్‌ నాకు ఈ కథను ఎప్పుడో చెప్పాడు. కానీ నాకున్న కమిట్‌మెంట్స్‌ వల్లే ఆలస్యం అయింది. ప్రణీత్‌ ఎప్పుడూ బెటర్‌మెంట్‌ కోసం ట్రై చేస్తుంటాడు. సెట్స్‌కు వెళ్లే ముందే పదిహేను వర్షెన్స్‌ రాసుకున్నారు. ప్రతీ సీన్‌, ప్రతీ కారెక్టర్‌లో బెటర్‌మెంట్‌ చూస్తుంటాడు. అదే ఆయన బలం. నా సినిమాల్లో కామెడీ ఉంటుంది. కానీ ఈ చిత్రంలో హీరో పాత్రలోనే కామెడీ ఉంటుంది. కామికల్‌గా క్యారెక్టర్‌ ఉంటుంది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో తీసినా కూడా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కించాం. నేను మా అన్నతో కలిసి పని చేయాలని అనుకోలేదు. నా సినిమా దర్శకులే కాలభైరవను ఎంచుకుంటారు. ఈ మూవీకి ఫస్ట్‌ సెలెక్ట్‌ అయింది కాల భైరవ అన్ననే. తరువాతే నేను సెలెక్ట్‌ అయ్యాను. కాల భైరవ అందించిన ఆర్‌ఆర్‌ వల్ల సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ సినిమాకు సంగీతమే మెయిన్‌ పిల్లర్‌. టీజర్‌, ట్రైలర్‌ నచ్చితే సినిమాల మీద జనాలకు ఆసక్తి కలుగుతుంది. ఇంత వరకు నా ఏ సినిమాకు రాని బజ్‌ ఈ చిత్రానికి వచ్చింది. తెలంగాణ, కేసీఆర్‌ డైలాగ్‌ బాగా క్లిక్‌ అయింది. ఇప్పుడు వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ వల్ల సినిమాలు బాగా ఆడుతున్నాయి. మా నిర్మాతలకు ఈ సినిమా, కథ పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంతో వాళ్లు మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అందర్నీ బాగా ఎంటర్‌టైన్‌ చేసే సినిమా’ అని అన్నారు.
స్క్రిప్ట్‌ విషయంలో డౌట్‌ వస్తే రాజమౌళి సలహాలు తీసు కుంటాను. ఆయనతో సినిమా చేయాలని అందరికీ కల ఉంటుంది. అయితే చనువు ఉంది కదా అని ఛాన్స్‌ అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు.
– శ్రీ సింహా కొడూరి

Spread the love