ఆ ఘర్షణలు బీజేపీ కుట్రే

– లీసెస్టర్‌లో మైనారిటీలపై దాడులకు ప్రేరేపించారు
– దుష్ప్రచారాలతో విద్వేషాలు రేకెత్తించారు
– ‘డెయిలీ మెయిల్‌’ సంచలన కథనం
లండన్‌ : గత సంవత్సరం బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో జరిగిన హింసాత్మక జాతి ఘర్షణలకు బీజేపీయే కారణమంటూ డెయిలీ మెయిల్‌ పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. వారాంతంలో ప్రచురితమైన ఈ వార్త ప్రకారం… బీజేపీ ప్రవచించే హిందూ జాతీయతావాదం, మతపరమైన, జాతిపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోంది. సమాజంలో తీవ్ర అశాంతిని సృష్టిస్తున్నది. దీనిలో భాగంగానే… గత వేసవిలో ముస్లిం యువతతో ఘర్షణలకు దిగాల్సిందిగా బీజేపీకి సన్నిహితంగా ఉండే శక్తులు బ్రిటన్‌లోని హిందువులను ప్రేరేపించారు. ఈ శక్తులు క్లౌడ్‌ వాట్సప్‌ గ్రూపులను ఉపయోగించుకొని, హిందూ నిరసనకారులను సమీకరించి, వారు వీధుల్లోకి వచ్చేలా ప్రోత్సహించారనడానికి ఆధారాలు ఉన్నాయని బ్రిటన్‌ భద్రతా దళానికి చెందిన సభ్యుడొకరు తెలిపారు. భారత హిందూ జాతీయతావాదులు ప్రైవేటు సోషల్‌ మీడియా పోస్టులను వినియోగించడం బ్రిటన్‌ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ఆయన హెచ్చరించారు. ‘ఇప్పటి వరకూ ఈ తరహా రాజకీయాలు గుజరాత్‌కే పరిమితమయ్యాయి. తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలు ఈ ఎత్తుగడలు అవలంబించాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో డెయిలీ మెయిల్‌ ప్రచురించిన ఈ వార్త రెండు దేశాల మధ్య దౌత్యపరమైన తుపాను సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏం జరిగిందంటే…
గత వేసవిలో లీసెస్టర్‌లో జాతి ఘర్షణలు చెలరేగాయి. కొత్తగా వచ్చిన హిందూ
వలసవాదులు, నగరంలో స్థిరపడిన ముస్లింల మధ్య అంతకు ముందు నెలల తరబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రిటన్‌లో జాతుల మధ్య సామరస్యానికి లీసెస్టర్‌ పెట్టింది పేరు. ఈ ఉద్రిక్తతల కారణంగా ఆ నగరం పేరుప్రతిష్టలకు విఘాతం ఏర్పడింది. గత ఆగస్టులో భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన తర్వాత హిందూ, ముస్లిం యువకుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయ మీడియా దృష్టి లీసెస్టర్‌పై పడింది. అదే సమయంలో భారత్‌లో హిందువులపై ముస్లింలు దాడులు చేశారంటూ దుష్ప్రచారం సాగించారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున సందేశాలు, మీమ్స్‌ పంపడం మొదలెట్టారు. ఇవి లీసెస్టర్‌లో ఉన్న హిందువుల వాట్సప్‌ గ్రూపులలో చక్కర్లు కొట్టాయి. గత ఆగస్ట్‌ 28న భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరిగిన తర్వాత సెప్టెంబర్‌ 22 వరకూ లీసెస్టర్‌లో అనేక రాత్రులు నిరసన ప్రదర్శనలు జరిగాయి. హిందూ యువకులు ‘జై శ్రీరామ్‌’ అని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరిగారు. లీసెస్టర్‌లోని హిందూ, ముస్లింలు, వారి నివాసాలు, ప్రార్థనా మందిరాల పైన దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి.
దేశంలోని హిందువులందరికీ తానే నాయకుడిగా ప్రచారం చేసుకోవాలన్న మోడీ ఆకాంక్షలో భాగంగానే ఇదంతా జరిగిందని భద్రతా వర్గాలు డెయిలీ మెయిల్‌ పత్రికకు తెలిపాయి. లీసెస్టర్‌ దాడులలో సోషల్‌ మీడియా పాత్రపై ఘర్షణల అనంతరం పలు అధ్యయనాలు జరిగాయి.

Spread the love