‘నాన్నకు అందని వైద్యం అందరికీ అందించాలని’

సంతోషంగా వుంది
నా భర్త, నేను ఏం చదువుకోలేదు. నాకున్న ఐదుగురు బిడ్డల్లో స్రవంతి చిన్న బిడ్డ. నలుగురు పెద్ద బిడ్డలను మాకున్నంతలో చదివించి పెండిండ్లు చేశాం. నా భర్త చనిపోయినంక ఈమె చదువు కూడా ఆపించి కూలీ పనికి పంపిస్తాను అనుకున్నా. కానీ నా వాళ్లంతా చదివించాలని గట్టిగా చెప్పడంతో సరేనన్నా. అంతా వాళ్లే చూసుకున్నరు. అక్షరం ముక్క రాని నేను ఇవ్వాళ సంతోషంగా ఉన్నాను. లనా ఇంటికి ఇపుడు ఎవరెవరో వచ్చి పోతున్నరు. ఇపుడే నా బిడ్డ డాక్టర్‌ అయినంత సంతోషంగా ఉంది నాకు.
– బుచ్చమ్మ, స్రవంతి తల్లి
లక్ష్యం చేరుకుంటా
నాకు తెలిసీ తెలియని వయసులోనే మా నాన్న చనిపోయాడు. సరైన వైద్యం అందితే నాన్న బతికేవాడని చుట్టుపక్కల వారు మాట్లాడుకోవడం విన్నాను. అప్పటి నుండే డాక్టర్‌ చదవాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే కష్టపడి చదివాను. ఇందుకు మా బంధువుల సహకారం కూడా తోడైంది. మొదటి సారి ప్రయత్నిస్తే ర్యాంక్‌ రాలేదు. అయినా ఏడాది పాటు కోచింగ్‌ తీసుకొని రెండో సారి ప్రయత్నించా. ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్‌ వచ్చింది. ఇపుడు అందరూ అభినందిస్తే సంతోషంగా అనిపిస్తోంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. మా నాన్న ఇప్పుడు లేకపోయినా, మా అమ్మ ముఖంలో సంతోషాన్ని చూస్తున్నా. తప్పకుండా వైద్య విద్య పూర్తి చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు నా వంతుగా వైద్యం అందిస్తా.
– ఎస్‌. స్రవంతి
తండ్రి అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు ఆమె వయసు 14 ఏండ్లు. తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి ఎలా మరణించాడో స్పష్టంగా తెలియకపోయినా, సరైన వైద్యం అందక చనిపోయాడని మాత్రం మనసులో ఉండిపోయింది. అదే ఆమె డాక్టర్‌ కావాలనే బలమైన లక్ష్యానికి కారణంగా నిలిచింది. ప్రస్తుతం ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగుతూ నీట్‌లో 427 మార్కులు సాధించింది. ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్‌ తెచ్చుకుంది. అంతే కాదు వైద్య విద్యను పూర్తి చేస్తే ఆదివార్‌ కొలవార్‌ తెగలో డాక్టరేట్‌ పట్టా పొందిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఆమె ఎస్‌.స్రవంతి.
కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చంద్రపల్లి గ్రామంలో పుట్టింది స్రవంతి. అసలే మారుమూల జిల్లా. అందులోనూ దహెగాం మండలమంటే మరింత మారుమూల ప్రాంతం. ఈ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రపల్లి. అక్కడ సుమారు 2,500 వరకు జనాభా ఉంటుంది. వారందరికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. భూమి లేని వారు కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అలా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వారిలో స్రవంతి కుటుంబం కూడా ఒకటి.
స్రవంతి తల్లి బుచ్చమ్మ, తండ్రి శంకర్‌. శంకర్‌ కూలీ పని చేస్తుండగా, బుచ్చమ్మ సమీప అడవికి వెళ్లి చీపురు పుల్లలు ఏరుకొని వచ్చి గ్రామంలో అమ్ముతూ కొంత డబ్బు సంపాదించేది. వీరికి ఐదుగురు అమ్మాయిలు. స్రవంతి అందరికంటే చిన్నది. నలుగురు అమ్మాయిల పెండిండ్లు అయి పోయాయి. స్రవంతిని స్వగ్రామంలోనే ఐదో తరగతి వరకు చదివించారు. ఆరు నుండి పదో తరగతి వరకు దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదివించారు. అక్కడ చదువుతున్న సమయంలోనే ఆమె తండ్రి శంకర్‌ క్యాన్సర్‌తో మరణించాడు.
శంకర్‌ సరైన వైద్యం అందక మృతి చెందాడని చుట్టుపక్కల వారు అనుకుంటూ ఉండేవారు. అది విని స్రవంతి చాలా బాధపడేది. అప్పటి నుండి డాక్టర్‌ కావాలని ఆమె కోరిక. డాక్టర్‌ అయ్యి పేదలకు, ముఖ్యంగా తమలాంటి మారుమూల ప్రాంతాల పేదలకు వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పదో తరగతిలో 8.2 జీపీఏ సాధించింది. తనకు డాక్టర్‌ కావాలనే కోరిక ఉందని బంధువులకు చెప్పింది. వీరంతా ఆమెకు అండగా నిలిచారు. స్థానికంగా ప్రభుత్వ కాలేజీ అందుబాటులో లేదు, ఉన్న ప్రైవేట్‌ కాలేజీలో చదివే ఆర్థిక స్థోమత లేదు. దాంతో బంధువుల సహకారంతో డీఆర్‌డీఏను సంప్రదించింది. హైద్రాబాద్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్వంలోని ఎస్‌.ఆర్‌ జూనియర్‌ కళాశాలలో సీటు సాధించి ఇంటర్‌ పూర్తి చేసింది.
ఇంటర్‌లో 934 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నీట్‌ శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్‌ వస్తుందని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఆపరేషన్‌ ఎన్‌రాల్డ్‌లో నీట్‌ శిక్షణ తీసుకొంది. అయితే మొదటి సారి ఆమెకు మంచి ర్యాంక్‌ రాలేదు. అయినా ఏ మాత్రం అధైర్య పడకుండా రెండో సారి పట్టుదలతో చదివి 427 మార్కులతో, 2,782 ర్యాంక్‌ సాధించి వైద్య విద్యకు ఎంపికైంది. ఆదివాసీలలో ఒక తెగ అయిన కొలవార్‌కు చెందిన స్రవంతి వైద్య విద్య పూర్తి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆ తెగలో డాక్టర్‌ పట్టా అందుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందుతుంది.
– సురేందర్‌రావు
కాగజ్‌నగర్‌ ప్రతినిధి, నవతెలంగాణ

Spread the love