ఘోర విషాదం..భార్య శవాన్ని తీసుకొస్తూ భర్త మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా భర్త రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రేఖేందర్‌ మల్లికార్జున్‌ (31) రేఖేందర్‌ శరణ్య(28) దంపతులు. మల్లికార్జున్‌ ఎప్పటిలాగే శనివారం ఉదయం లారీ నడిపేందుకు వెళ్లాడు. ఇంటి సమీపంలోని వావిలాల రజని.. శరణ్యను అకారణంగా దూషించింది. ఇది విన్న శరణ్య.. రజని ఇంటికెళ్లి ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రజని.. శరణ్యపై చేయి చేసుకున్నది. ఆ తర్వాత వరుసకు పిన్ని అయిన రేఖేందర్‌ రాణి ప్రోత్సాహంతో రజని.. శరణ్యపై లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న శరణ్యను మరోసారి తిట్టగా తీవ్ర మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన శరణ్య మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు హూటాహుటిన లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటలకు చనిపోయింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో శరణ్య మృతదేహంతో తిరిగి ఎల్లారం బయలుదేరారు. ఆ వెనుకాలే మల్లికార్జున్‌ తన సడ్డకుడితో కలిసి బైక్‌పై వస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లక్షెట్టిపేటకు చేరుకోగానే.. మూత్ర విసర్జన కోసం బైక్‌ ఆపి రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లికార్జున్‌ మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. అంతకుముందు మల్లికార్జున్‌ ఇచ్చిన ఫిర్యాదుతో వావిలాల రజనితో పాటు రేఖేందర్‌ రాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం భార్యభర్తలిద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రుల మృతితో ఓంకార్‌ (6), ఇవాంక(4) అనాథలయ్యారు.

Spread the love