తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. ప్రత్యేక కార్యక్రమాలు

– అదే రోజు సచివాలయంలో జాతీయ పతాకావిష్కరణ
– 22 వరకు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
– రోజుకో రంగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు
– 22న అమరుల సంస్మరణ కార్యక్రమం
– దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్‌ను విడుదల చేసిన సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 22వ వరకు మొత్తం 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రెటరియేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
షెడ్యూల్‌
జూన్‌ 2 : హైదరాబాద్‌లోని గన్‌ పార్కు వద్ద గల అమర వీరుల స్థూపానికి సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయ ప్రాంగణంలో కేసీఆర్‌ జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశాలుంటాయి.
జూన్‌ 3 : ఆ రోజును తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలే కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు …. రైతులతో కలిసి సామూహిక భోజనాలు చేస్తారు.
జూన్‌ 4 : పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని, పోలీస్‌ శాఖ సమర్థవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు.
జూన్‌ 5 తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో వినియోగదారులు, రైతులు, విద్యుత్‌ ఉద్యోగుల సమావేశాలుంటాయి. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. అదే రోజు సింగరేణి సంబురాలను కూడా నిర్వహిస్తారు.
జూన్‌ 6 : తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పారిశ్రామికవాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు.
జూన్‌ 7 : సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ నియోజకవర్గాల్లో సభలుంటాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
జూన్‌ 8 : ఊరూరా చెరువుల పండుగను నిర్వహిస్తారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్‌ 9 : తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్దిదారులతో సభలు నిర్వహిస్తారు. ఇదే అంశాలపై హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సభ ఉంటుంది.
జూన్‌ 10 : తెలంగాణ సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తారు. అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల ద్వారా జరిగిన మేలును వివరిస్తారు.
జూన్‌ 11 : తెలంగాణ సాహిత్య దినోత్సవంగా జరుపుకుంటారు. జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది.
జూన్‌ 12 : అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం ఆరు గంటలకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
జూన్‌ 13 : తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటారు. ఉత్తమ మహిళా ఉద్యోగులను సన్మానిస్తారు.
జూన్‌ 14 : తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానా నూతన భవనానికి, విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.
జూన్‌ 15 : తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవంగా జరుపుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.
జూన్‌ 16 : తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి కార్పొరేషన్‌, ప్రతి మున్సిపాల్టీ, ప్రతి పట్టణం సాధించిన ప్రగతిని వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్‌ 17 : తెలంగాణ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహిస్తారు.
జూన్‌ 18 : తెలంగాణ మంచినీళ్ల పండుగను నిర్వహిస్తారు.
జూన్‌ 19 : తెలంగాణ హరితోత్సవం ఉంటుంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
జూన్‌ 20 : తెలంగాణ విద్యా దినోత్సవం నిర్వహిస్తారు. అన్ని విద్యాసంస్థల్లో సభలు నిర్వహించి, ఆ రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తారు. అదే రోజున ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మన ఊరు – మన బడి పాఠశాలలకు రిబ్బన్‌ కట్‌ చేస్తారు. 10 వేల గ్రంధాలయాలను, 1, 600 డిజిటల్‌ క్లాస్‌ రూంలను ప్రారంభిస్తారు. విద్యార్థులకు, వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలను నిర్వహిస్తారు.
జూన్‌ 21 : తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవంగా నిర్వహిస్తారు. అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలుంటాయి.
జూన్‌ 22 : అమరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అన్ని పల్లెలు, పట్టణాలు, నగరాలు, విద్యాలయాల్లో శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటిస్తారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ తీర్మానాలను ప్రవేశపెడతారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు.

Spread the love