మళ్లీ ‘ఉరే’నియం…

ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టెది మరో దారన్నట్టు కడు విచిత్రంగా, వింతగా ప్రవర్తించటంలో కాషాయ నేతలు దిట్టలు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించటంలో వారు సిద్ధహస్తులు. పాత సమాధులన్నింటినీ తవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఇచ్చిన పిలుపు తరహాలో ఆ పార్టీకే చెందిన సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఇప్పుడో పాత అంశాన్ని కొంగొత్త తరహాలో పైకి తెచ్చి ‘వారేవ్వా…’ అనిపించారు. అదే నల్లమలలో యురేనియం తవ్వకాలు. అక్కడ ఆ ఖనిజాన్ని తవ్వటం, తద్వారా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటం వల్ల వేలాది మంది గిరిజన బిడ్డలకు ఉపాధి కల్పించొచ్చన్నది ఆయన గారి ఉవాచ. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నదంటూ ఆ ఎంపీ గారి ఆవేదన. లోతుల్లోకి పోకుండా కేవలం పైపైన, పలచ పలచగా మాత్రమే దీన్ని చూస్తే మనం తప్పులో కాలేసినట్టే.
వాస్తవానికి గత రెండు, మూడేండ్ల క్రితం నల్లమలలో యురేనియం తవ్వకాల అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు అక్కడి ప్రజల్లో, ముఖ్యంగా ఆదివాసీల్లో తీవ్ర అలజడి రేగింది. కన్నతల్లిలా కాపాడుతున్న అడవి తల్లి నుంచి తమను దూరం చేసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ వారు ఆందోళన చెందారు. ఇదే సమయంలో వామపక్షాలు, ప్రజా, సామాజిక సంఘాలు వారికి మద్దతుగా నిలిచాయి. ఇంకోవైపు యురేనియం తవ్వకాలు జరిపితే నల్లమలతోపాటు చుట్టుపక్కల జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఎడారులవుతాయంటూ పర్యావరణ, అటవీ నిపుణులు హెచ్చరించారు. కృష్ణా జలాలు తీవ్రంగా కలుషితమవుతాయనీ, ఫలితంగా హైదరాబాద్‌కు సరఫరా అయ్యే మంచి నీరు సైతం విషతుల్యమవుతుందంటూ హెచ్చరించారు. మొత్తంగా యురేనియం తవ్వకాలు అడవి బిడ్డలకు ఉరేస్తాయనీ, రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయనే ప్రమాద సంకేతాలను వారు ఇచ్చారు. అయితే కేంద్రం చేపట్టిన ప్రయోగాత్మక తవ్వకాలపై మొదట మౌనం దాల్చిన రాష్ట్ర ప్రభుత్వం… వాటిని ఖండించకపోవటం గమనార్హం. ఆ తర్వాత అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తటంతో అనివార్యంగా ‘తవ్వకాలొద్దు…’ అంటూ బీఆర్‌ఎస్‌ సర్కారు స్పందించింది. మరోవైపు కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు పెరిగాయి. అవి అంతకంతకూ తీవ్రతరమవుతుండటంతో మోడీ సర్కార్‌ వెనక్కి తగ్గింది. యురేనియం తవ్వకాలు, సంబంధిత ప్రయోగాలు అప్పటికి ఆగిపోయాయి.
కానీ ఇప్పుడు బీజేపీ ఎంపీ నోట మరోసారి యురేనియం తవ్వకాల మాట ప్రస్తావనకు రావటం గమనార్హం. అంటే రాష్ట్రానికి ‘ఉరేసే’ చర్యలను ఆ పార్టీ గానీ, కేంద్రంగానీ పక్కకు పెట్టలేదన్నమాట. వారి మనసుల్లో ఇంకా యురేనియం తవ్వాలి.. దాన్ని కార్పొరేట్‌ గద్దలకు కట్టబెట్టాలనే ఆలోచన దాగుండటం అత్యంత ఆందోళనకరం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనుల కేటాయింపు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తదితరాంశాలను తెరపైకి తెచ్చింది. బీఆర్‌ఎస్‌ నేతలు ఏ అవసరాల కోసం ఆ అంశాన్ని చర్చనీయాంశం చేసినప్పటికీ వాటి వల్ల తెలుగు రాష్ట్రాలకు లాభమే గానీ నష్టం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై సమాధానం చెప్పని కేంద్రం, బీజేపీ… రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలను ఉసిగొల్పి సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నది. అందులో భాగంగానే లక్ష్మణ్‌ నోటి నుంచి యురేనియం మాట బయటకొచ్చింది.
ఈ క్రమంలో గతంలో మాదిరిగానే మరోసారి ‘ఉరేనియం’ మాటలను, కేంద్రం చర్యలను ఎక్కడికక్కడ తుంచేయాలి. ఈ అంశంపై విస్తృత చర్చలు నిర్వహించాలి. నల్లమలపై బీజేపీ పడగ నీడ, దాని వల్ల జరిగే నష్టాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలి. అలాంటి చర్యలకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమాలను నిర్వహించాలి. అప్పుడే అలాంటి ఆలోచనల నుంచి కేంద్రం వెనక్కి తగ్గుతుంది.

Spread the love