వజ్ర కాళేశ్వరి దేవిగా…

‘న్జన్‌ ప్రకాశన్‌, మనోహరం, బీస్ట్‌’ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయిక అపర్ణాదాస్‌. ‘విటి04’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రశేశం చేస్తున్నారు. ఎంతో ప్రతిభ గల అపర్ణాదాస్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం పట్ల చిత్ర బందం సంతోషం వ్యక్తం చేసింది. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌.నాగ వంశీ, ఎస్‌.సాయి సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల, జోజు జార్జ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అపర్ణా దాస్‌ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రను పోషిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు కచ్చితంగా న్యాయం చేస్తుందని చిత్ర బందం విశ్వసిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబందం పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అపర్ణ ఇటీవల తమిళంలో నటించిన ‘దాదా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను, అప్‌డేట్లను మేకర్స్‌ త్వరలోనే తెలియజేయనున్నారు.

Spread the love