మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ

– రెండు ఇండ్లు దగ్ధం మరోసారి కర్ఫ్యూ అమలు
ఇంఫాల్‌ : బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. రాష్ట్రంలో మళ్లీ తాజాగా అల్లర్లు చెలరేగాయి. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో న్యూ చెకాన్‌ ప్రాంతంలో సోమవారం రెండు ఇండ్లను దుండగులు తగులపెట్టారు. సోమవారం మధ్యాహ్నం ముందుగా బలవంతంగా దుకాణాలను మూయించిన సాయుధ దుండగులు తరువాత వారి ఇండ్లను దగ్ధం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తేవడానికి బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో కొంత మంది గాయపడ్డారు. మరోవైపు ఇండ్లను తగులబెట్టిన సంఘటనకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో మళ్లీ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు. గతంలో సడలించిన నిబంధనలను మళ్లీ కఠినతరం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ‘రాష్ట్రంలో సాధారణ స్ధితిని పునరుద్ధరించడానికి ఇదే సమయం’ అని చెప్పిన కొన్ని గంటల్లోనే మళ్లీ హింసాకాండ చెలరేగడం విశేషం. బిజెపి ప్రభుత్వ అసమర్థతతోనే మళ్లీ హింస చెలరేగిందని విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. ఈ నెల 3 నుంచి కుకీలు, మైతీలకు మధ్య ఘర్షణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు వారం రోజులు పాటు కొనసాగిన ఘర్షణల్లో 70 మందికి పైగా మరణించగా, వందల సంఖ్యలో వ్యక్తులు గాయపడ్డారు. 35 వేలకు పైగా ఇళ్లను పూర్తిగానూ, పాక్షికంగానూ దగ్ధమయ్యాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుకీలు, మైతీలకు మధ్య సమస్యను కేంద్రం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లనే మణిపూర్‌ అల్లకల్లోమయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురి అరెస్టు
సోమవారం అల్లర్లకు సంబంధించి ఒక మణిపూర్‌ మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ సోమవారం సాయంత్రం వెల్లడించారు. న్యూ చెకాన్‌ ప్రాంతంలో ఇండ్లను దగ్ధం చేయడం, షాపులను బలవంతంగా మూయించడంలో ఈ ముగ్గురి పాత్ర ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరు ముగ్గురూ ఆయుధాలు ధరించి స్థానికులను భయపెట్టారని చెప్పారు. అస్సాం రైఫిల్స్‌ వీరిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారని, వారి వద్ద నుంచి మూడు షాట్‌గన్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

Spread the love