గుజరాత్‌లో చెలరేగిన హింస

– మసీదు అక్రమ నిర్మాణమంటూ అధికార యంత్రాంగం నోటీసులు
– జునాగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన వైనం
– పోలీసుల లాఠీచార్జీ, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం
– అల్లర్లలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు
– 174 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అహ్మదాబాద్‌ : బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లో హింస చెలరేగింది. మసీదు అక్రమ నిర్మాణమంటూ జునాగఢ్‌ యంత్రాంగం పంపించిన నోటీసులు అల్లర్లకు దారి తీశాయి. నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు, వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఆ తర్వాత హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 174 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జునాగఢ్‌లోని మజెవాడి దర్వాజ దగ్గర ఉన్న మసీదు భూమికి సంబంధించిన తగిన యాజమాన్య పత్రాలు చూపాలంటూ ఈనెల 14న జునాగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఒక నోటీసును జారీ చేసింది. ఇందుకు ఐదు రోజుల సమయాన్ని కేటాయించింది. అయితే, నిర్ణీత గడువు ముగియటంతో మసీదును కూల్చివేయడానికి మునిసిపల్‌ యంత్రాంగం సిద్ధమైంది. దీంతో శుక్రవారం సాయంత్రం కూల్చివేత నోటీసుతో అధికారు లు మసీదు ప్రదేశానికి వచ్చారు. ఇది నిరసనకారులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కూల్చివేత నోటీసుకు వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. రోడ్లను దిగ్బంధించారు. రాత్రి వరకు రోడ్ల మీద కూర్చున్నారు. అయితే, రాత్రి పది గంటల సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. రాళ్ల దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక పౌరుడు మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. అయితే, పోస్టు మార్టం తర్వాతే వ్యక్తి మృతికి గల కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ అల్లర్ల ఘటనలో పోలీసులు 174 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు. అల్లర్లు చెలరేగటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి భారీ సంఖ్యలో పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నది. ఈ ఘటనతో సంబంధమున్న మిగతావారిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని జునాగఢ్‌ డిప్యూటీ ఎస్పీ వెల్లడించారు.

Spread the love