ధర కోసం ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?

నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం శంషాబాద్‌ గ్రామానికి చెందిన శుభంఖోడే అనే రైతు 8 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 80క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు అవసరాల కోసం 20క్వింటాళ్లు మాత్రమే విక్రయించారు. మిగతా 60క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే నిల్వ చేశారు. ధర పెరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ మొదట్లో ఉన్న ధర కూడా రానురానూ మరింత దిగజారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జైనథ్‌ మండల కేంద్రానికి చెందిన ఆశన్న నాలుగెకరాల్లో పత్తి సాగుచేశారు. 40క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు క్వింటాల్‌ పత్తి కూడా మార్కెట్‌కు తీసుకెళ్లలేదు. ధర పెరుగుతుందనే ఆశతో పత్తి మొత్తాన్ని ఇంట్లోనే నిల్వ ఉంచారు. ఇలాంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ధర పెరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, ధర పెరగకపోగా.. మరింత తగ్గుతుండటంపై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల అవస్థలు తీరడం లేదు. మార్కెట్‌లో ధర పెరగకపోవడంతో పండించిన పత్తి పంటను ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు. పంట కాలం పూర్తయినా ఇంకా విక్రయించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మార్కెట్‌ ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.8300వరకు పలికిన ధర తాజాగా క్వింటాల్‌కు రూ.7300కి పడిపోయింది. దీంతో పత్తిని విక్రయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు. మరోపక్క వాణిజ్య కొనుగోళ్లు చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పూర్తిగా చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం పత్తి సేకరణకు నిదులు తగ్గించింది. ప్రయివేటు వ్యాపారులతో సమానంగా ధర నిర్ణయిస్తూ రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఈ ఏడాది కనీసం కిలో పత్తి కూడా సదరు సంస్థ కొనుగోలు చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కిందటేడాది పత్తి మొత్తం విక్రయించిన తర్వాత క్వింటాల్‌కు రూ.10,300వరకు ధర ఉండటంతో రైతులు అదే ఆశతో ఉన్నారు. ఈ ఏడాది కూడా సీజన్‌ చివరలో పత్తి ధర రూ.10వేల వరకు పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. నెలల తరబడి క్వింటాళ్ల కొద్దీ పత్తిని ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. కానీ అధికారవర్గాలు మాత్రం ధర పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు.

Spread the love