సంపద సృష్టించాలి… ప్రజలకు పంచాలి

–  గుణాత్మక అభివృద్ధికి వినూత్న రీతిలో విభిన్న ఆలోచనలతో పాలన : బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో విభిన్నమైన ఆలోచనలతో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పునరుద్ఘాటించారు. దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా, అవే మూస ధోరణులను కేంద్ర పాలకులు అవలంభిస్తున్నారని తెలిపారు. అపారమైన సహజ వనరులను వినియోగించుకోవడం ఎటూ చేతగాని కేంద్ర ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత, వృత్తి కులాలు వంటి సంపద సృష్టించే అపూర్వమైన మానవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతోందని స్పష్టం చేశారు. సరైన దార్శనికత లేకపోవడం వల్ల దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదని అధినేత సిఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో పరివర్తన చెందిన భారత దేశాన్ని తీర్చిదిద్దే మహౌన్నత లక్ష్యంతో ఏర్పాటైన ‘భారత్‌ పరివర్తన్‌ మిషన్‌ ‘ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు మహారాష్ట్ర నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు గురువారం హైదరాబాద్‌లో సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ముంబయి సహా పలు ప్రాంతాలనుంచి వచ్చిన వారికి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీరు, బొగ్గు సహా దేశంలో అవసరాలకు మించి నిల్వ వున్న సహజ సంపద, ప్రకృతి వనరుల గురించి వివరించారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటుతున్నా వాటిని సరియైన రీతిలో వినియోగించుకోవడం చేతగాక ప్రజల కష్టాలకు కన్నీళ్లకు కారణమవుతున్నారని కేంద్ర పాలకులను సీఎం దుయ్యబట్టారు. ఇలాంటి అభివృద్ధి నిరోధకులకే ఓట్లేసుకుంటూ వారిని కాకుంటే వీరిని, కాకుంటే వారిని ఇంకెన్నాళ్లు గెలిపించుకుంటూ పోదామని ప్రశ్నించారు. కుల, మతాలకతీతంగా సమస్త ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీనీ, నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన చైతన్యం ప్రజల్లో మరింతగా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
పురుషులకు సమాన సంఖ్యలో ఉన్న మహిళా శక్తిని కేవలం వంటింటికి పరిమితం చేస్తూ, ఉత్పాదక రంగంలో, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయక పోవడం వల్ల దేశం నష్టపోతున్నదని సీఎం ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, యువత సహా పలు రకాల మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. వారి వారి సామర్థ్యాలను గుర్తించి ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలే తప్ప.. కేవలం వారి కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షతకు స్వస్తి పలకాలనీ, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ దిశగా సమూల మార్పు జరగాల్సిందేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు.

Spread the love