ఎవరు దోషులు!

ఆ ఘటన జరిగింది మే 4న. అంటే రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ సోషల్‌ మీడియా లేకపోతే దారుణం వెలుగుచూసేదే కాదు. మణిపూర్‌లో ఇంతటి అఘాయిత్యం జరిగిందని ప్రపంచానికి తెలిసేదే కాదేమో! అందుకనే అధికారం ఇంటర్‌నెట్‌నూ బంద్‌ పెట్టింది. ఇది ఇప్పుడు తెలిసింది. తెలియకుండా జరిగిన అమానుషత్వాలెన్నో ఇప్పుడు మణిపూర్‌ కావచ్చు. నిన్న కాశ్మీర్‌లో జరగలేదా! మొన్న గుజరాత్‌లో ఏమయింది! ఉత్తర భారతంలో నిర్భయలెంతమంది! గర్భవతి పొట్టచీల్చి పసిగుడ్డును హతమార్చి సామూహిక హత్యాకాండ యధేచ్ఛగా సాగినప్పుడు, నేరస్తులకు శిక్షపడిందా? లేదు. అది పురికొల్పిన వారికి ఏకంగా దేశ అధికారమే అందింది. లైంగికదాడి చేసి హత్య చేసినవారికి మద్దతుగా మహాప్రదర్శన తీసినవారు కళ్ళెదుటే అధికారంలో ఊరేగుతున్నారు. కాశ్మీర్‌లో చిచ్చురేపి మారణకాండకు ఉసిగొల్పుతుంటే చూస్తూనే ఊరకవున్నాము కదా! నేరస్తులు రాజ్యం చేస్తున్న చోట ఘోరాలు కాక ఘనకార్యాలేముంటాయి! మెజారిటీల మాట మైనారిటీలు వినాలనీ, లోబడి ఉండాలనీ, తంతే పడాలనీ వాదం మొదలయ్యాక, అది మతమైనా, జాతయినా, తెగలయినా ఇలా తగలబడిపోవడమే కదా! జరిగిన ఘటనకు కన్నీరు కారుస్తూ రగిలిపోతున్నవారు దోషులనూ గుర్తించాలి.
79రోజుల క్రితం మణిపూర్‌లోని కాంగ్‌ పోస్కీ ఆదివాసీ ప్రాంతం. కుకీ తెగ నివాసాలపై మైటీ తెగ మారణాయుధాలతో దాడికి తెగబడింది. ప్రజలు భయభ్రాంతులైపోయారు. మహిళలూ పరుగుతీసారు. పోలీసులు రక్షిస్తారనుకున్నారు. కానీ దాడులకు తెగబడిన గుంపుకే మహిళలను అప్పగించారు. వాళ్లు స్త్రీలను వివస్త్రలుగా చేసి ఊరేగించారు. సామూహిక అత్యాచారమూ చేశారు. అడ్డొచ్చిన తండ్రినీ, తమ్మున్నీ చంపేసారు. పైశాచికంగా ప్రదర్శన తీశారు. పోలీసులు వీటన్నింటికీ కాపలాకాసారు. ఎందుకంటే మైటీ సమూహానికే అక్కడి ప్రభుత్వం సంఘీయ మూకలూ మద్దతుగా ఉన్నారు. అరాచకానికి అమానవీయానికి రాజ్యం నేతృత్వం వహిస్తే ఏం జరుగుతుందో ఎన్ని అనుభవాలు లేవుమనకు! అందుకే అక్కడా అలానే జరిగింది. దాడి చేస్తున్నప్పుడూ పోలీసులున్నారు. నగంగా ఊరేగిస్తున్నప్పుడూ ఉన్నారు. హత్యలు చేస్తుండగానూ ఉన్నారు. అక్కడ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వమూ ఉంది. ఇది దేశానికి అవమానకరమని సిగ్గుపడాల్సిన విషయమని బాధపడి ఖండిస్తున్న మానవీయులు అసలు దోషులెవరో గుర్తించాలి!
ఏం సిగ్గుంది మనకు. ఎన్ని సహించి, భరించి, నికృష్టంగా వెళ్లదీస్తున్నాం! ఎంత నిర్లజ్జగా, నిర్భయంగా ఘటనలు జరిగిపోతున్నాయి. మూడు నెలలుగా రెండు వర్గాలు మంటల్లో కాలిపోతుంటే కనీసం మాట్లాడకుండా ఉండే నాయకుడు ప్రపంచంలో ఎవడయినా ఉంటాడా? ఇప్పుడు మొసలికన్నీరు కార్చడానికి సిగ్గూలేదు యెగ్గూలేదు! పైగా యాభైఆరు యించుల ఛాతీ! మన వ్యవస్థలేమయ్యాయి? రాష్ట్రపతి, ఎస్టీ కమిషన్‌, మానవహక్కుల సంఘం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం, మేధావులు, మీడియా యేరి? ఎక్కడున్నారు! ఈ ప్రశ్నలన్నీ కొందరు ఐఏఎస్‌లు వేస్తున్నారు. మణిపూర్‌ ఘటనపై ఏం చర్య తీసుకున్నారు? మీరు కదులుతారా? మేము కలుగచేసుకోవాలా? అని సుప్రీంకోర్టు అనేదాకా అటువైపుకే చూడని, మాట్లాడని మౌన చతురున్ని కన్నాకనైనా ఓ నా సోదరులారా! దోషులను నిలెయ్యండి.
మొన్నొకడు ఆదివాసీపై మూత్రం పోస్తాడు. దళితుడితో ఒకడు బూట్లు నాకిస్తాడు. నేడు ఆదివాసీ మహిళలల్ని నగంగా హింసిస్తారు. ఇంతటి కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ హిందువులందరూ బంధువులని నినాదాలిస్తారు! ఎంతటి కపటనాటకం! మనుషులుగా బతకటం మాని మతంగానో, కులంగానో, ప్రాంతంగానో విద్వేషపు మంటలు రేపుతున్న సంఘటనలు చూస్తున్న జనులందరూ దోషులెవరో కనిపెట్టటం కష్టం కాబోదు. ఆదివాసీల హక్కులు, మానవహక్కుల విధ్వంసమవుతున్నాయని అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంటే, యూరోపియన్‌ యూనియన్‌ పరిష్కరించమని తీర్మానం చేస్తే కూడా కదలని, మెదలని, ఉలకని, పలకని మహౌపన్యాసకుడు నేతయిన చోట నిత్యం పొగిడే భక్తజనం ఇప్పుడు కనపడరేం! సచ్ఛీలత గురించి, సంప్రదాయం, సంస్కృతి గురించి తెగ ఓండ్రపెట్టే గుంపు ఇప్పుడు దోషులెవరో చెప్పాలి కదా! ఒక సెలబ్రెటీకి కూతురు పుడితే ఆసుపత్రి చుట్టూ మూగిపోయే మీడియా ఏమైంది! కేరళ స్టోరీ అనీ, కాశ్మీర్‌ఫైల్స్‌ అనీ ఉన్నవి లేనివి తెరకెక్కించే సినీ మాయకులు మణిపూర్‌ ఫైల్స్‌ తీసే దమ్ముందా చెప్పండి! అరచి కేకలు పెట్టే ప్రోగ్రామర్సేరి! ఎక్కడ దాక్కున్నారు. ఛానళ్ల గొంతు ధ్వనించదేమి! నేరపూరిత మౌనాన్ని బద్ధలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపకుండా, అందరి సహాయాన్ని తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు బాధ్యతగా పూనుకోవాలి. దోషుల ఇల్లు తగులబెట్టి, ఎన్‌కౌంటర్‌ చేసి, మరో నేరానికి పాల్పడటం దుర్మార్గమే అవుతుంది. ప్రపంచంలోని ప్రతి మనిషి సిగ్గుపడే ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో జనం తెలుసుకుని చైతన్యపరచి దోషులను గుర్తించాలి, శిక్షించాలి!

Spread the love