విజేత

వింధ్య పర్వత ప్రాంతాన్ని పాలించే మృగరాజు ప్రతీ సంవత్సరం వన్య ప్రాణులకు సాంస్కృతిక, క్రీడోత్సవాలు నిర్వహించేది. అడవిలోని ప్రతి ప్రాణీ తమకు ప్రావీణ్యమున్న అంశంలో పాల్గొనేవి. పోటీలలో ప్రజ్ఞ చూపించి, రాజ సత్కారంతో పాటు మిగిలిన పశుపక్ష్యాదుల మన్ననలు చూరగొనేవి.
ఈ ఏడాది కూడా యధావిధిగా పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లో ఇంచుమించు నిరుటి వారే ప్రథములుగా వచ్చారు. ఒక్క గానంలో మినహా. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, కోకిలని తోసిరాజని ఒక కాకి పాటల పోటీలో ప్రథమ స్ధానం సాధించింది. ఆ ఫలితం చూసి సభాసదులు విస్తుపోయారు. అసలు కాకి పోటీలో పాల్గొనటమే దుస్సాహసమనుకుంటే ఏకంగా అగ్రస్ధానం పొందటంతో ముక్కున వేలేసుకున్నారు.
మృదువైన స్వరంతో ఆలాపన చేస్తూ, అలవోకగా గమకాలను పలికిస్తూ, అవలీలగా ఆరోహణ, అవరోహణ స్ధాయిలను చూపిస్తూ మధురగానం చేసింది వాయసం. పాట విన్న సభికులు మంత్ర ముగ్దులై, మైమరచి పోయారు. అమృత గానమని వేనోళ్ళ పొగిడారు. బహుమతి ప్రధానం అనంతరం మంత్రి ఏనుగు కాకిని అభినందిస్తూ ”కర్ణకఠోరమైన స్వరం కలిగిన నువ్వు, ఘనాపాఠీ అయిన కోకిలని అధిగమించి, చేసిన గానం మమ్మల్ని తన్మయత్వంలో ముంచెత్తింది. ఇదెలా సాధ్యమైందో తెలుసుకోవాలని అందరూ ఉత్సుకతగా ఎదురు చూస్తున్నారు .నీకు అభ్యంతరం లేకపోతే తెలుపమని కోరుతున్నాను” అంది.
కాకి వినమ్రంగా నమస్కరించి ”నాకు గానం పట్ల ఆసక్తి ఎక్కువ. మంచి గాయకుడిగా పేరు సంపాదించాలని కలలు కన్నాను. అందుకోసం కఠోర శ్రమ చేసాను. ‘అనగననగ రాగ మతిశయిల్లుచునుండు’ అనేది జగమెరిగిన సత్యం. రోజుకి ఆరు గంటలపాటు అభ్యాసం చేసాను. అందువలన కంఠంలో కరుకుదనం పోయి సున్నితత్వం చేరింది. తద్వారా పాటలు పాడే మెలకువ అబ్బింది. ఇక మిగిలింది మీకు తెలిసిందే” అంది.
అప్పటికి దిగ్భ్రమ నుండి తేరుకున్న కోకిల ”ఇది మున్నెన్నడూ కనీవినీ ఎరుగని విడ్డూరం. ఇందులో ఏదో గూడు పుఠాణీ జరిగింది. దాన్ని నిగ్గుతేల్చి, విచారించి నాకు న్యాయం జరిపించండి” అని గగ్గోలు పెట్టింది. సింహం ఆగ్రహంతో లేచింది. ”ఇందులో నువ్వు ఆరోపించే అవక తవకలేం జరగలేదు. అందరూ కళ్ళారా చూసారు. చెవులారా విన్నారు. కాకిది అమర గానం. అది పాడేటపుడు కనబరచిన అంకితభావం, ప్రాణం పెట్టి పాడిన విధానం శ్లాఘనీయం. అందుకు విరుద్దంగా నువ్వు నిర్లక్ష్యంగా పాడావు. నీకు తిరుగు లేదనే అహంభావంతో ప్రవర్తించావు. అందుకు ఫలితం ద్వితీయ స్ధానానికి దిగజారటం. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్న సూక్తిని విస్మరించావు. వాడకపోతే వాడిగల కత్తి అయినా తుప్పు పట్టిపోతుంది. నిరంతర సాధనతో కాకి తన మెరటు గొంతుని మెత్తగా మార్చుకుంది. ఇది కేవలం కృషి, పట్టుదల తప్ప న్యాయనిర్ణేతల పక్షపాత వైఖరి కారణం కాదు. కాబట్టి ఈర్ష్యని వదిలి, క్రీడాస్ఫూర్తితో కాకిని అభినందించటం నీ తక్షణ కర్తవ్యం” అని హితవు పలికింది. అయినా కోకిల సమాధాన పడక సణుగుతూనే ఉంది.
దాంతో కాకి బాధపడి సింహంతో ”మహారాజా! కోకిల సందేహ నివృత్తి కలిగించే అవకాశం కల్పించండి” అని వినయంగా పలికింది”
”ఎలా?” అని ఆశ్చర్యపోతూ అనుమతించింది మృగరాజు.
వెంటనే కాకి సభ వైపు తిరిగి ”ఆచార్యా! వేదిక మీదకి రండి!” అంటూ ఆహ్వానించింది. ఆ పిలుపు విన్న ఒక వృద్ధపికము లేచి నెమ్మదిగా కదిలి వచ్చింది. దాన్ని సభకు పరిచయం చేస్తూ ”నేను ఈ రోజు సాధించిన విజయం వెనుక ఉన్న శక్తి, మా గురువర్యులే. రాయిని రత్నంగా మార్చారు” అంటూ పాదాభివందనం చేసింది. ఆనంద భాష్పాలతో శిష్యుని ఆలింగనం చేసుకుంది వృద్ధ పికము. అది చూసిన కోకిల ”ఇలాంటిదేదో జరిగి ఉంటుందని నాకు మొదట్నించీ అనుమానంగానే ఉంది. సాటి కోకిలకి సహాయం చేయకుండా, ప్రత్యర్ధి కాకికి తర్ఫీదు ఇచ్చి, నన్ను ఓడిస్తావా? ఇది నాకు జరిగిన అవమానం కాదు. సమస్త కోకిల జాతికే ద్రోహం చేసావు” అంటూ విరుచుకు పడింది.
వృద్ధ పికము ఆ నిందలకి నొచ్చుకోలేదు. మృగరాజు వైపు తిరిగి ”మహారాజా… ఇది ఎంతమాత్రమూ ద్రోహం కాదు. గురువు ఎప్పుడూ జిజ్ఞాసుడైన శిష్యుడినే కోరుకుంటాడు తప్ప అయోగ్యుడిని కాదు. నిజానికి కాకి జాతికి నేను అర్పించిన కతజ్ఞత ఇది. మా కోకిల జాతి మనుగడకి సాయపడుతున్న వాయసజాతికి హృదయపూర్వక నీరాజనం. మా కోకిలలు గూడు కట్టవు. దొంగచాటుగా కాకి ఇంట్లో గుడ్లు పెట్టేసి, తమ మానాన పోతాయి. ఈ మోసం తెలియని కాకులు పొదిగి, పిల్లల్ని చేసి, ఆహారం తెచ్చి సాకుతాయి. కూత పెట్టాక నిజం గ్రహించి మమ్మల్ని పారదోలతాయి. నిజానికి ఆ ప్రాయం వచ్చాక ఏ పక్షి అయినా, జంతువు అయినా పిల్లల్ని స్వతంత్రంగా బతకమని వదిలేస్తాయి. కాబట్టి కాకులని తప్పు పట్టనక్కరలేదు. కాకులు మా కోకిలలు చేసే కపటాన్ని ముందే గ్రహిస్తే పసిగుడ్డుగానే పగిలిపోతాం. మా జాతి ప్రయాణం అర్ధాతరంగంగా ఆగిపోతుంది. అలా మా సంతతిని నిలబెడుతున్న కాకులను పూజించాలి గాని, ద్వేషించకూడదు. అందుకే నా వంతు రుణం నేను తీర్చుకున్నాను” అంటూ కళ్ళు తుడుచుకుంది.
వింటున్న సభాసదుల గుండెలు కరిగి నీరయ్యాయి. నిజాన్ని గ్రహించిన కోకిల తన తప్పుని ఒప్పుకుని క్షమించమని వేడుకొంది. అప్పుడు మృగరాజు ఇలా అంది ”ప్రతిభకు కొలమానం లేదు. అది ఏ ఒక్కరి సొత్తూ కాదు. దృఢ సంకల్పమూ, కఠోర దీక్ష కలిగిన వారెవరైనా ఏదైనా సాధించగలరు. కాకి సాధించిన విజయం కొత్త చరిత్రని లిఖించింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మరుసటి ఏడాదికి అభ్యర్ధులు సిద్ధం కావాలని అభిలషిస్తున్నాను” అంది. హర్షధ్వానాలతో వాయస విజయాన్ని గానం చేస్తూ అడవి ప్రాణులు ఆనందంగా వెనుదిరిగాయి.
– కౌలూరి ప్రసాదరావు, 9346700089