అత్తింటి వేధింపులకు మహిళ ఆత్మహత్య

– కుమారుడికి ఉరేసి తానూ వేసుకున్న తల్లి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన కుమారుడికి ఉరివేసి తానూ వేసుకుంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ పోలిస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని వినాయకనగర్‌లో విశ్వనాథ్‌, శిరీష(22) దంపతులు కుమారుడు మనీష్‌(4), విశ్వనాథ్‌ తండ్రి, తల్లితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో అత్త బసవమ్మ వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన శిరీష శుక్రవారం రాత్రి కుమారుడికి ఉరివేసి, ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందు కున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త, అత్త, మామను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శిరీష గర్భంతో ఉన్నట్టు సమాచారం.

Spread the love