తప్పు గురునానక్‌ది.. శిక్ష విద్యార్థులకా..?

యూనివర్సిటీ గుర్తింపు లేకున్న అడ్మిషన్లు 6 వేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకం
అడ్మిషన్లు పొంది ఏడాది కావొస్తున్న గుర్తింపు శూన్యం
ఒక్కో సీటు కోసం రూ.3 లక్షల వరకు ఫీజులు వసూలు
అనుమతులు రావని తెలిసి చేతులెత్తేసిన యాజమాన్యం
తలలు పట్టుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
గురునానక్‌ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని సంఘాల డిమాండ్‌
ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థుల ఆశ అడియాశలైంది. మంచి కళాశాలలో చేరాలన్న సంకల్పం ఓడిపోయింది. గురునానక్‌ బ్రాండ్‌ పేరును చూసి మోసపోయారు. తమ విద్యా సంవత్సరం కోల్పోవడంతో తలలు పట్టుకుంటున్నారు. యూనివర్సీటీ గుర్తింపు రాకున్నా అడ్మిషన్లు స్వీకరించి గురునా నక్‌ కళాశాల యాజమాన్యం తప్పు చేస్తే, నేడు అడ్మిషన్లు పొందిన విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు. విద్యార్థులను మోసం చేసి యాజమాన్యంపై చీటింగ్‌ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాల్సిన ప్రభుత్వం, పాలకపక్షం, పోలీసులు, అధికారులు గురునానక్‌ కళాశాల యాజమాన్యం వైపే నిలిచారు. ఆరు వేల మంది విద్యార్థులు బజారున పడుతున్న వారికి బాసటగా నిలవలేకపోయారు. చివరికి లాఠీచార్జీ, కేసుల పాలయ్యారు. మద్దతు పలికిన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు సైతం అరెస్టు అయ్యారు. గురునానక కాలేజీ ధనదహానికి విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ కళాశాల యాజమా న్యం నిర్వాహకం వలన ఆరు వేల మంది విద్యార్థుల భవిత వ్యం ప్రశ్నార్థకంగా మారింది. యూనివర్సిటీ గుర్తింపు లేకపోయినా అడ్మిషన్‌ తీసుకు న్నారు. అడ్మిషన్‌ పొంది ఏడాది కావస్తున్నా గుర్తింపు లభించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. అనుమతులు రావని తెలిసి కళాశాల యాజమాన్యం చేతులెత్తేసింది. దాంతో విద్యార్థులు తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఆగ్రహాన్ని గురై ఆందోళన బాట పట్టారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. చివరకు వారికి మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు అయ్యారు. చివరకు ఆ నాయకులకు కోర్టుబెయిల్‌ మంజూరు చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుం టున్న గురునానక్‌ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
యూనివర్సిటీ బిల్లు ఆమోదం లేకుండా..
అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ప్రయివేట్‌ యూనివర్సి టీల ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర లభించింది. గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తేనే చట్ట రూపం దాల్చినట్లు. గవర్నర్‌ ఆమోదించక పోగా.. సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టింది. పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గవర్నర్‌ బిల్లును ఆమోదించకపోగా అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ తిప్పి పంపింది. అసెంబ్లీలో బిల్లు పాసైన వెంటనే ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ కాలేజీ యాజమాన్యం సహా ఇదే ప్రాంతంలోని శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ కూడా గుర్తింపు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. ఆర్థిక వనరులతో పాటు ప్రభుత్వ పెద్దల అండదండలు వీరికి ఉండడంతో తమ కాలేజీకి గుర్తింపు వచ్చి తీరుతుందని భావించింది. ఆ క్రమంలోనే అడ్మిషన్లు స్వీకరించారు. గవర్నర్‌కు ప్రభుత్వం పంపిన బిల్లు చట్ట రూపం దాల్చక ముందే కొత్త యూనివర్సిటీ పేరుతో 2022-23 విద్యా సంవత్సరానికి ఒక గురునానక్‌ కళాశాలలో నాలుగు వేలు, శ్రీనిధి కళాశాలలో రెండు వేలకు పైగా అడ్మిషన్లు స్వీకరించారు. ఇప్పటికే రూ. లక్షలు చెల్లించి కాలేజీలో అడ్మిషన్‌ తీసుకొని, తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఒక్కో సీటు కోసం రూ.3లక్షల ఫీజులు వసూలు
గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోంది. రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన యాజమాన్యం యూనివర్సిటీ గ్రాండ్స్‌ కమిషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు రాకున్నా విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంది. రెగ్యులర్‌ విద్యార్థులకు సమానంగా తొమ్మిది నెలల నుంచి తరగతులు నిర్వహించింది. మార్కెట్‌లో గుర్తింపు పొందిన కాలేజీ కావడంతో విద్యార్థులు ఏమీ ఆలోచించకుండా అడ్మిషన్లు తీసుకున్నా రు. ఒక్కో సీటుకు రూ.మూడు లక్షలకు పైగానే ఫీజు చెల్లించారు. రెగ్యులర్‌ విద్యార్థులకు ఇప్పటికే ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు పూరైతే.. రెండో సెమిస్టర్‌ సిద్ధమవుతున్నారు. కానీ ఇదే క్యాంపస్‌లో నిర్వహించనున్న ప్రయివేట్‌ యూని వర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు మాత్రం ఇప్పటికీ సెమిస్టర్‌ పరీక్షలకు నోచుకోలేదు. మరో నెలలో విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి అనుమతులు రాకపోవడంతో అడ్మిషన్లు పొంది తరగతుల కు హాజరవుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తు ఏంటో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురునానక్‌ కళాశా లపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లీదండ్రులు కోరుతున్నారు.

Spread the love