ప్రపంచశాంతికి యోగ సులభమైన మార్గం

– ప్రఖ్యాత యోగ గురు శ్రీకృష్ణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అనాది నుంచి ప్రపంచశాంతి స్థాపనకు భారతదేశం యోగద్వారా ఎంతో కృషి చేసిందని ప్రఖ్యాత యోగ గురు శ్రీకృష్ణ చందక అన్నారు. ప్రపంచశాంతికి, సకల మానవ సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి అది ఒక సులభమైన మార్గమని చెప్పారు. తొమ్మిదో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బుధవారం పీఐబీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పతంజలి యోగ శాస్త్రంలో ప్రస్తావించిన యమ, నియమ, ఆసన, ప్రాణామాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ విశిష్టతను తగిన ఉదాహర ణలతో వివరించారు. కార్యక్రమంలో పీఐబీ, ఆర్‌వోబీ అధికారులు ఎన్‌వైకె ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) సహాయ సంచాలకులు ఇనుముల హరిబాబు చెప్పారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన సీబీసీ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యజీవితంలో రోజూ యోగా సాధన చేయడం ద్వారా అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని చెప్పారు. యోగా మాస్టర్‌ ఓంప్రకాశ్‌ అందరితోనూ యోగాసనాల గురించి వివరించి సాధన చేయించారు. సీబీసీ యోగాపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు మెమోంటోలు, ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు రిసికాంత్‌, రత్న, ప్రిన్సిపాల్‌ భవాని, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు శ్రీధర్‌, కుమారస్వామి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love