అదానీకి కాపలాకుక్కల్లా కేంద్ర దర్యాప్తు సంస్థలు

–  రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు
–  వైఎస్‌ జగన్‌ దుర్మార్గ ముఖ్యమంత్రి
–  సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అదానీకి కాపలాకుక్కల్లా వ్యవహరిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. సెబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు. బుధవారంనాడిక్కడి మఖ్ధూం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహాతో కలిసి మాట్లాడారు. ఆదానీ వ్యవహారంపై ప్రపంచమంతా సీరియస్‌గా ఉంటున్నా, కేంద్ర ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదన్నారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి నోళ్లు మూయించే పనిలో ప్రధాని మోడీ, హౌం మంత్రి అమిత్‌షా ఉన్నారని ఎద్దేవా చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై తక్షణం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై చర్చిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ మద్దతు లేకుండా అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలా చేరుతారని అన్నారు. తాలిబన్లు పండించే గంజాయిని అదానీకి చెందిన ముండ్రా పోర్టు ద్వారా దిగుమతి చేసుకొని దేశమంతా సరఫరా చేస్తున్నారనీ, దీనికి వీలుగా గంగవరం, కష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం తదితర పోర్టుల్ని ఆయనకు కట్టబెట్టారని అన్నారు. దండకారణ్యంలోని ఖనిజాలను దోచుకొనేందుకే ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణాదిలో పోర్టులు, హైవేలు నిర్మిస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. న్యాయవ్యవస్థ నుంచి రిటైరైన వారికి గవర్నర్‌, నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ తరహా ప్రలోభాల నివారణకు చట్టాలు రావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. బాధితులనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టడాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ నేత పట్టాభిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయపార్టీల కార్యాలయాలపై దాడులు మానుకోవాలని హితవు చెప్పారు. ఖమ్మంలో ధర్నా చేసి వస్తూ యాధృచ్ఛికంగా సీపీఐ శ్రేణులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రలో కలిశాయనీ, దాన్ని చూపి, కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో పోతున్నారనే ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. కమ్యూనిస్టులకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనీ, దానికోసం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి రాజకీయ ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు.