అదానీ చేతిలో గుజరాత్‌ పవర్‌

అహ్మదాబాద్‌ : కేంద్రమైనా, రాష్ట్రమైనా.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడున్నా అదానీకి అండగా నిలుస్తున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అదానీ సంస్థలకు లబ్దిని చేకూరుస్తున్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ అక్కడి గుజరాత్‌ ప్రభుత్వం ఇలాగే చేసింది. 2021-22 మధ్య అదానీ పవర్‌ ప్రాజెక్టు నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలును జరిపింది. ఇలా కొనుగోలు చేసిన సగటు విద్యుత్‌ ధర 102 శాతం అధికం కావడం గమనార్హం. గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర విద్యుత్‌ మంత్రి కానూ దేశారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆప్‌ ఎమ్మెల్యే హేమంత్‌ అహిర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం.. అదానీ పవర్‌ ప్రాజెక్టు నుంచి కొనుగోలు చేసిన సగటు విద్యుత్‌ ధర 2022లో యూనిట్‌కు రూ. 3.58 నుంచి రూ. 7.24కు పెరిగింది. ధరలో పెరుగుదల ఉన్నప్పటికీ అదానీ పవర్‌ నుంచి మాత్రం విద్యుత్‌ను కొనడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం ఆపలేదు. కిందటేడాది(2021)తో పోల్చుకుంటే 2022లో 7.5 శాతం అధిక విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ఈ రెండేండ్ల కాలంలో గుజరాత్‌ ప్రభుత్వం 2021లో 5,587 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయగా అది 2022లో 6007 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రభుత్వం అదానీ పవర్‌కు రూ. 8,160 కోట్లను చెల్లించింది. 2007లో అదానీ పవర్‌ వేసిన బిడ్‌ రాబోయే 25 ఏండ్లలో యూనిట్‌కు రూ. 2.89 నుంచి రూ.2.35 రేంజ్‌లో విద్యుత్‌ను అమ్మే విధంగా ఆమోదింపబడింది. కానీ, నిర్దేశిత ధరకు కాకుండా అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు జరపడం గమనార్హం. అదానీ పవర్‌ ప్రాజెక్టు ఇండోనేషియా నుంచి వచ్చే బొగ్గు మీద ఆధారపడి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేదనీ, అయితే, 2011 తర్వాత అంతర్జాతీయంగా బొగ్గు ధరల పెరుగుదలతో ఆ సంస్థ పూర్తి స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోయిందని గుజరాత్‌ మంత్రి తెలిపారు. అయితే, ఈ విషయంలో ఏర్పాటు చేయబడిన హైపవర్‌ కమిటీ సిఫారసులను ఆమోదిస్తూ విద్యుత్‌ కొనుగోలు ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, అదానీ పవర్‌ మధ్య 2021లో మరొక ఒప్పందం కుదిరిందని మంత్రి చెప్పారు. అయితే, ప్రభుత్వం ఈ నష్టాలను పూడ్చుకునేందుకు రాష్ట్రంలో ఇంధన, విద్యుత్‌ చార్జీలను పెంచుతుందని విద్యుత్‌ రంగ నిపుణుడు ఒకరు తెలిపారు. దీనితో రాష్ట్రంలోని సామాన్య జనం ఈ భారాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. చాలా ఏండ్లుగా తాము విద్యుత్‌ టారీఫ్‌ ధరలను పెంచలేదని గుజరాత్‌ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అధికారిక యంత్రాంగాలు ఎఫ్‌పీపీపీఏ ఛార్జ్‌ను సైలెంట్‌గా పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఇంధన మరియు విద్యుత్‌ ధర సవరణ ఛార్జీలను కనీసం ఎనిమిదిసార్లు పెంచడం గమనార్హం.