అదానీ మోసాలకు అంతేలేదయా..!.

–  ఆస్ట్రేలియాలోనూ బాధితులు
–  ప్రజల రిటైర్మెంట్‌ పొదుపులు ప్రభావితం
–  పెద్ద ఎత్తున పెట్టుబడులతో భారీగా నష్టం
–  అదానీ గ్రూపు స్టాక్స్‌లో ఏర్పడిన క్షీణతే కారణం
–  వెల్లడించిన ‘ది గార్డియన్‌’ పత్రిక
న్యూఢిల్లీ : అదానీ బాధితుల చిట్టా భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. కేంద్రం సాయంతో ఆయన వ్యాపారాలు విదేశాలకు పాకిన విధంగానే.. అక్కడ కూడా బాధితులు పెరుగుతున్నారు. హిండెన్‌ బర్గ్‌ పరిశోధక నివేదిక బయటకు వచ్చిన అనంతరం అదానీ గ్రూపు కంపెనీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం విదితమే. ఫలితంగా భారత్‌లోని పెట్టుబడుదారులు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఈ విషయం ఇటు భారత పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు మోడీ సర్కారును ప్రశ్నించాయి. సుప్రీంకోర్టు సైతం దేశంలోని పెట్టుబడిదారుల రక్షణ విషయంలో కేంద్రం స్పందనను కోరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ‘ది గార్డియన్‌’ పత్రిక అదానీ కంపెనీకి సంబంధించిన ఇంకో విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. అదానీ బాధితులు భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదనీ, ఆస్ట్రేలియాలోనూ ఉన్నారని వివరించింది.
పెట్టుబడులకు భారీ దెబ్బ
‘ది గార్డియన్‌’ పత్రిక కథనం ప్రకారం.. మోడీ సర్కారు ఇచ్చిన విపరీతమైన స్వేచ్ఛ అదానీ వ్యాపార విస్తరణకు కారణమైంది. దేశీయంగానే కాదు.. విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టడం.. పోర్టులు చేజిక్కించుకోవడం.. ఆకాశమే హద్దుగా విపరీతమైన లాభాలను గడించింది. ఆస్ట్రేలియాలను బొగ్గు గనులతో పాటు ఒక పోర్టును సైతం అదానీ గ్రూపు నిర్వహిస్తున్నది. దీంతో అదానీ గ్రూపు కంపెనీలకు మంచి పేరు వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి అదానీ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అయితే అదానీ గ్రూపు కంపెనీ స్టాక్స్‌లో ఏర్పడిన క్షీణతతో ఆస్ట్రేలియా ప్రజల రిటైర్మెంట్‌ పొదుపులు
ప్రభావితం అయ్యాయి. వారు అదానీ సంస్థల్లో పెద్ద ఎత్తును పెట్టుబడులు పెట్టడంతో నష్ట పోయారని ‘ది గార్డియన్‌’ వెల్లడించింది. ముఖ్యంగా, క్వీన్స్‌ లాండ్‌ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కామన్‌వెల్త్‌ సిబ్బందికి సంబంధించిన ఫండ్‌పై ఎక్కువ ప్రభావం చూపినట్టు పేర్కొన్నది.
ఆస్ట్రేలియాలో వ్యాపార సామ్రాజ్యం
అదానీ గ్రూపునకు ఆస్ట్రేలియాలోనూ వ్యాపార సామ్రాజ్యము ఉన్నది. అక్కడ కార్మైకేల్‌ బొగ్గు గనితో పాటు అబాట్‌పాయింట్‌ పోర్టును అదానీ గ్రూపు నిర్వహిస్తున్నది. ఈ సంస్థలు అక్కడ మంచి వృద్ధిని నమోదు చేశాయి. ఈ కారణంగా అక్కడ ఈ కంపెనీలకు పేరు వచ్చింది. దీంతో అనేక సూపర్‌ యాన్యుయేషన్‌ ఫండ్‌లు వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కామన్‌వెల్త్‌ బ్యాంకు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి రూ. 20.12 లక్షల కోట్లు (243 బిలియన్‌ డాలర్లు)తో ఒక ఫ్యూచర్‌ ఫండ్‌ను ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది. అదానీ గ్రూపులోని రెండు కంపెనీల్లో అది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. పెట్టుబడితో పోలిస్తే ప్రస్తుత స్టాక్‌ విలువ దారుణంగా పడిపోవడం గమనార్హం.
భారీగా పెట్టుబడులు
బ్రిస్బేన్‌కు చెందిన ఆస్ట్రేలియన్‌ రిటైర్మెంట్‌ ట్రస్టుకు రూ. 16.56 లక్షల కోట్ల ( 200 బిలియన్‌ డాలర్ల)ఆస్తులున్నాయి. అది కూడా అదానీ గ్రూపులో ని దాదాపు ఆరు కంపెనీల్లో లక్షలాది డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. హెల్త్‌, కమ్యూనిటీ సర్వీస్‌ వర్కర్లకు సేవలందించే రూ. 5.79 లక్షల కోట్ల (70 బిలియన్‌ డాలర్ల) విలువైన హెస్టా ఫండ్‌ కూడా వీటిలో పెట్టుబడి పెట్టినట్టు గార్డియన్‌ పేర్కొన్నది. నార్వేకు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌కు సైతం పెద్ద ఎత్తున ఈ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. కానీ.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడే కొంత కాలానికి ముందే.. తన మొత్తం వాటాలను విక్రయించి బయటపడిందని గార్డియన్‌ వివరించింది. గార్డియన్‌ కథనం నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనూ అదానీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది.