అది ప్రభుత్వ భూమే : హైకోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్‌
రంగారెడ్డి జిల్లా బాలానగర్‌ మండలం ఫతేనగర్‌ సర్వే నెంబర్‌ 78, 79లోని సుమారు 11.5 ఎకరాల భూమి ప్రభుత్వానివేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ భూమి ఏపీ ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెందినదని గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం తీర్పు చెప్పింది. ఆ కార్పొరేషన్‌ నుంచి భూమిని స్వాధీనం చేసుకోవడం చెల్లదన్న సింగిల్‌ జడ్జి తీర్పు చెల్లదని తేల్చింది. యూఎల్సీ రద్దయ్యే నాటికి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందనీ, పాత తేదీలతో యూఎల్సీ యాక్ట్‌ కింద నోటీసు ఇచ్చారని సింగిల్‌ జడ్జి తీర్పులో పేర్కొనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసింది.
శిశుమందిర్‌కు లక్ష రూపాయలు చెల్లించండి
భూమి విషయంలో స్టేటస్‌కో ఆర్డర్‌ ఉండగా ఆ భూమిని వేరే వారికి విక్రయించిన ఇద్దరికి హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. లక్ష రూపాయలను భద్రాచలంలోని సరస్వతి శిశుమందిర్‌కు చెల్లించాలని సుశ్మిత, ఆమె కుమార్తెలను ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. రూ. రెండు వేలను జరిమానా కూడా విధించింది. ఈ ఉత్తర్వులను రెండు వారాల్లోగా అమలు చేయకపోతే 15 రోజులు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ భీమపాక నగేష్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఇటీవల తీర్పు వెలువరించింది. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉండగానే భూమిని అమ్మేశారంటూ దాఖలైన కోర్టు ధిక్కర కేసులో వారిద్దరూ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. లక్ష రూపాయల్ని చెల్లిస్తామని వారు ముందుకు వచ్చారు. దీంతో హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.