– త్రిపురలో బీజేపీ మూకల హింసాకాండ
– ప్రజలపై అంతులేని దారుణాలు
– ఇండ్లు, కార్లను తగలబెట్టిన మూకలు
– రబ్బర్ తోటల ధ్వంసం
– ప్రజల జీవనోపాధి పైనే ప్రధాన దాడులు
– 668 హింసాత్మక సంఘటనలు నమోదు
– సీఐటీయూ, ఏఐకేఎస్ కార్యకర్తల ఇండ్లు కార్యాలయాలే లక్ష్యంగా…
అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రపు మెజారిటీ లభించిన తర్వాత, బీజేపీ నాయకత్వం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై భయోత్పాతాన్ని కలిగించే దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వందలాది ఇండ్లు బూడిద కుప్పలుగా మారాయి. రాజకీయ ప్రత్యర్ధుల జీవనోపాధులను ధ్వంసం చేయడం, భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే బీజేపీకి ఈ దాడుల వెనుక గల ఉద్దేశ్యంగా వుంది. అందువల్ల, డెయిరీ, పౌల్ట్రీ ఫారాలు, రబ్బర్‌తో సహా అన్ని రకాల పంటలను పూర్తిగా ధ్వంసం చేశారు. చివరకు ఆవులను కూడా బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టలేదు. పశువుల శాలలతో సహా పశువులను తగలబెట్టేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాతనే ఈ భయోత్పాతాన్ని కలిగించే దాడులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం వరకు, త్రిపురలో ఇలాంటి హిం సాత్మక సంఘటనలు 668 జరిగాయి. త్రిపురవ్యాప్తంగా సీఐటీయూ, ఏఐకేఎస్ కార్యాలయాలను, కార్యకర్తల ఇండ్లను బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. సీఐటీయూకి చెందిన త్రిపుర మోటార్ శ్రామిక్ యూనియన్ కార్యాలయాన్ని పూర్తిగా దోచుకుని ధ్వంసం చేశారు. అఖిల భారత కిసాన్ సభకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా కీలక కార్యకర్తలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చేర్చారు. బీజేపీ గూండాల దాడుల్లో అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ఇండ్లు, ఇంటి ఫర్నిచర్, టెలివిజన్లు, ఫ్రిజ్‌లు, వాహనాలు, పాలిచ్చే పశువులు, పశువుల కొట్టాలు, రబ్బర్ తోటలు, కాపుకొచ్చిన పంటలు, చెట్లు, చేపలు, కోళ్ళ ఫారాలు ఇలా ప్రతీదీ పూర్తిగా ధ్వంసం చేయబడింది. వామపక్షాలకు చెందిన వందలాదిమంది రాజకీయ కార్యకర్తలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గానూ ఇళ్ళు వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఏఐకేఎస్ నేతలు – శంకర్ దేవ్‌నాథ్ (మేఖలీపారా) కాళీంద్ర నాథ్, అజరు నాథ్(ఖేయార్‌పూర్ నియోజకవర్గం), బ్రజాపూర్‌కి చెందిన అమర్ దేవ్‌నాథ్, మధ్య లగ్జింబిల్‌కి చెందిన మనీర్ హుస్సేన్, ఘనియామారాకి చెందిన రఫిక్ ఇస్లామ్, గోపాల్ దేవ్‌నాథ్, దులాల్ దేవ్‌నాథ్, బిషాల్‌ఘర్ నియోజకవర్గంలోని పరిమళ్ చౌక్ హమోనికి చెందిన సుఖ్‌లాల్ దేవ్‌నాథ్‌లు ఈ హింసాకాండలో తీవ్రంగా నష్టపోయారు. జుబరాజ్‌నగర్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎ, త్రిపుర కిసాన్ సభ రాష్ట్ర కమిటీ సభ్యుడు శైలేంద్ర నాథ్‌కి చెందిన చిన్న రబ్బర్ తోటను కూడా బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ధ్వంసం చేశారు. శైలేంద్ర నాథ్‌కు ఈ రబ్బర్ తోట ఒక్కటే ఆదాయ వనరు. అలాగే, బాక్సానగర్‌లో నిధిర్ లస్కర్, ప్రదీప్ దాస్‌ల రబ్బర్ తోట లు కూడా బీజేపీ గూండాల దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు అందని వార్తల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా రబ్బర్ తోటలను ధ్వంసం చేశారు. చాందిపూర్ సీపీఐ(ఎం) అభ్యర్ధి కృష్ణేంద్రు చౌదరి ఇంటిపై దాడి చేసి కూల్చివేశారు. మాజీ ఎంఎల్‌ఎ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు, త్రిపుర గణ ముక్తి పరిషత్ ప్రధాన కార్యకర్త, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిపై దాడి జరిగింది. ఆయనను ప్రస్తుతం రాష్ట్ర రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఖేయార్‌పూర్‌కి చెందిన సంగీత వాయిద్యకారుడు, ప్రముఖ కళాకారుడు మాణిక్ దాస్ ఇల్లును మార్చి 4వ తేదీన పూర్తిగా ధ్వంసం చేశారు. ఓడిపోయిన బీజేపీ అభ్యర్ధి తుఫాజల్ హుస్సేన్ ఆధ్వర్యంలో బాక్సానగర్ నియోజకవర్గంలో ఇలాంటి అర్ధరహితమైన, దాడులు అనేకం జరిగాయి. ఎఐకెఎస్ కార్యకర్తలు అసీస్ సర్కార్, సురేష్ బర్మాన్, అజిత్ బర్మాన్‌ల ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వారి ఇళ్ళలోని సామానును లూటీ చేసి తగలబెట్టారు. అలమిన్, అబూనబి, రోషన్ అలీ దుకాణాలు, ప్రబీర్ బిశ్వాస్ పుస్తకాల దుకాణం కూడా లూటీ చేశారు. ఖుర్‌షెదార్ రహమాన్, రోషన్ అలీ, హరదన్ సర్కార్ ఇళ్ళు, రతన్ దాస్ ఇండ్లపై బాంబులతో దాడులు చేశారు. లూటీ చేశారు. తుఫాజల్ హుస్సేన్ నాయకత్వంలోని ఇదే బీజేపీ కార్యకర్తల క్రిమినల్ ముఠా రహింపూర్ మార్కెట్, మాణిక్య మార్కెట్, పుతియా మార్కెట్, మాటినగర్ మార్కెట్, బాక్సానగర్ మార్కెట్‌లను ధ్వంసం చేశారు. కమలానగర్, అమండా బజార్ మార్కెట్‌లను బలవంతంగా మూసివేయించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా కార్లు, ఇతర వాహనాలు ఉపయోగించి ఈ విధ్వంసకాండను కొనసాగించారు. ఏఐకేఎస్‌కు బలమైన ప్రాంతాలైనందున ఈ ప్రాంతాలను వారు లక్ష్యంగా చేసు కున్నారు. ఈ అన్ని సంఘటనల్లో, బీజేపీ గూండాలను నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. పోలీసు స్టేషన్ ఎదురుగా ఏఐకేఎస్ కార్యకర్తలు గుమిగూడి ధర్నా చేయడంలో ఇక పోలీసులు రంగంలోకి దిగి ఏదో చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, దుండ గులు విస్తృతంగా సాగించిన ఈ అమానవీయమైన, విస్తృత హింసా కాండలో ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడులను ప్రతిఘటించడానికి, అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ట పోలింగ్ జరిగేలా చూసేందుకు కార్మికులను, రైతులను సమీకరించి, వారిలో విశ్వాసాన్ని నింపడంలో త్రిపుర కిసాన్ సభ, గణ ముక్తి పరిషత్, సీఐటీయూలు అగ్రభాగంలో వుండడంతో ఎఐకెఎస్, సిఐటియులను బిజెపి లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బిజెపి, దాని మిత్రపక్షాలు ఈసారి 11శాతం ఓట్లు కోల్పోయాయి. ఈసారి ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీ తో గెలుపొందింది. అఖిల భారత మాజీ జాయింట్ కార్యదర్శి, ఏఐకేఎస్ ప్రస్తుత సికెసి సభ్యుడైన జితేంద్ర చౌదరి మినహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు షామ్‌సల్ హక్, ఇస్లాముద్దీన్, శైలేంద్ర నాథ్ కూడా కొత్త అసెంబ్లీకి ఎన్నికయ్యారు. త్రిపురలో తమ కార్యకర్తలు, సభ్యులపై సాగించిన ఈ ఆటవిక్ హింసాకాండకు వ్యతిరేకంగా ఏఐకేఎస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు, ఎన్నికల అనంతర హింసాకాండను అంతమొందించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఐటీయూ, ఏఐకేఎస్ లు ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశాయి. ఈ హింసకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసి, ప్రజల జీవితాలకు వారి జీవనో పాధులకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని త్రిపుర చీఫ్ సెక్రటరీని, పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశాయి. ఈ తరహా నిరంకుశవాదం, అప్రజాస్వామికవాదం, అమానవీయ ప్రవర్తనాశైలిని ఏ మాత్రమూ సహించలేం. సంఘటిత రైతాంగ, కార్మికోద్యమం ఈ దారుణమైన హింసాకాండ బాధితులకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిం చింది. రైతులు, కార్మికులు ముందుకు వచ్చి ఈ హింసను ప్రతిఘటించాలని, ఈ విస్తృతమైన నేరాలకు పాల్పడిన వారందరిపై కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది.