ఆడిట్‌ కోసం గ్రాంట్‌ థోర్టంట్‌ నియామకం

– అదానీ గ్రూపు వెల్లడి
న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్‌ తీవ్ర ఆర్థిక అరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తనపై విశ్వాసం పెంచుకునే పనిలో పడింది. ఇందుకోసం తమ కొన్ని కంపెనీల్లో స్వతంత్ర ఆడిటింగ్‌ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్‌ థోర్టంట్‌ను నియమించుకున్నది. అదానీ కంపెనీలు తీవ్ర ఎకౌంటెన్సీ అక్రమాలు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకోవడం, డొల్ల కంపెనీలతో విదేశాల నుంచి పెట్టుబడు లకు పాల్పడుతుందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ ఓ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ దెబ్బతో అదాని కంపెనీ స్టాక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మరో వైపు అదానీ కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంక్‌ లు, విత్త సంస్థలు, బీమా కంపెనీలు బెంబేలె త్తుతున్నాయి. అదానీ గ్రూపునపై వచ్చిన అరోపణలను తిప్పి కొట్టేందుకు.. అదానీ వాదనలను సమర్థించు కునేందుకు, ఇన్వెస్టర్ల లో విశ్వాసాన్ని పెంచుకునేందుకు గ్రాంట్‌ థోర్టంట్‌ సంస్థను ఆడిటింగ్‌కు నియమించు కుని ఉండొచ్చని నిపుణులు భావి స్తున్నారు. నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్‌ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ.. గ్రాంట్‌ థోర్టంట్‌ ఏమి చేస్తుందో వేచి చూడాలి. మంగళవారం సెషన్‌లోనూ అదానీ కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొ న్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.87 శాతం, పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ 2.06 శాతం, ఎసిసి 0.39 శాతం చొప్పున పెరగ్గా.. మిగతా స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌, తదితర సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.