ఆరోగ్యశ్రీని తీసేయొద్దు

  • కొనసాగిస్తేనే పేదలకు 
  • మేలు చలాన్లు వేయడంపైనే ట్రాఫిక్‌ పోలీసుల దృష్టి
  •  ఉర్దూ కమిషన్‌ను నియమించాలి 
  •  శాసనసభలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
    ఆయుష్మాన్‌ భారత్‌ అమలు పేరుతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని తీసేయొద్దని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. దానివల్లే పేద ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అయితే వైద్యానికయ్యే రేట్లు ఎన్నో ఏండ్ల క్రితం నిర్ణయించారనీ, వాటినే ప్రస్తుతం చెల్లిస్తుండడంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడం లేదని అన్నారు. అందువల్ల ఆరోగ్యశ్రీ రేట్లను ప్రస్తుత అవసరాలకనుగుణంగా మార్చాలని సూచించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం శాసనసభలో వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, హోం శాఖ, వైద్యారోగ్యం, నీటిపారుదల, జీఏడీ వంటి పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార భాష తెలుగు, రెండో అధికార భాష ఉర్దూ అని చెప్పారు. ఈక్రమంలో ఉర్దూ కమిషన్‌ను నియమించాలన్నారు. టీఎస్‌పీఎస్సీలో మైనార్టీ సభ్యుడుండాలని సూచించారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం మైనార్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. తెలుగు, ఇంగ్లీష్‌తోపాటు ఉర్దూలోనూ పోటీ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఆర్‌ఐ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బస్తీ దవాఖానాలు మరిన్ని అవసరమనీ, నిమ్స్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయనీ, ఎలాంటి అల్లర్లు జరగడం లేదని అన్నారు. హిందూ ముస్లింలు కలిసున్నారు, కలిసే ఉంటారని వివరించారు. ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడంపై కాకుండా చలానాలు వేయడంపైనే దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. దీంతో సామాన్యులపై భారాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ లేకపోయినా, ముగ్గురు ద్విచక్రవాహనంపై వెళ్లినా చలానాలు వేస్తే అభ్యంతరం లేదన్నారు. కానీ ట్రాఫిక్‌ పోలీసులు ఓ మూలన కూర్చుని ఫొటోలు తీసి పంపడం సరైంది కాదని చెప్పారు. పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. వాటికితోడు ట్రాఫిక్‌ పోలీసుల చలాన్లు వేయడంతో వాహనదారులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారనీ, పరేషాన్‌లో ఉన్నారని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా తొలగించిన హోంగార్డులకు ఉద్యోగాలివ్వాలని కోరారు. పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ నియామకాల్లో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, పరుగుపందెం నిబంధనలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వాటికి సంబంధించి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 2004లో నియామకమైన ఎస్‌ఐలకు పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేసి, కానిస్టేబుళ్లకు మాత్రం కాంట్రిబ్యూరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
    దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి : రఘునందన్‌రావు
    దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు కోరారు. అక్కడ డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. వంద పడకల ఆస్పత్రికి సిబ్బందిని నియమించాలని సూచించారు. పెద్ద చెరువు పనులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. 800 మంది హోంగార్డులను కక్షసాధింపుతో తొలగించారని చెప్పారు. పదేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించి మానవతాదృక్పథంతో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు.
    బావుల దగ్గరకు రోడ్లెయ్యాలి : ధర్మారెడ్డి
    పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో రోడ్లు మెరుగయ్యాయని బీఆర్‌ఎస్‌ సభ్యుడు ధర్మారెడ్డి అన్నారు. మారుమూల ప్రాంతాలు, తండాలకూ రోడ్లు వేయడంతో ప్రజలు ఆనందంతో ఉన్నారని చెప్పారు. అయితే ట్రాక్టర్లు, కార్లు రావడంతో వారి పొలాలు, బావుల దగ్గరికి రోడ్లు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. పంచాయతీరాజ్‌ నిధులతో ఆ రోడ్లు వేయాలని కోరారు. ప్రగతి భవన్‌ను పేల్చేస్తాం…కొత్త సచివాలయం గేట్లు పగలగొడతామంటూ మాట్లాడుతున్న పిచ్చోళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మిర్చి, పసుపు పంటలకు మద్దతు ధర ప్రకటించలేదని బీఆర్‌ఎస్‌ సభ్యుడు పెద్ద సుదర్శన్‌రెడ్డి అన్నారు. దీంతో ఆయా రైతులు ఉనికి కోల్పోయే ప్రమాదముందన్నారు. అదానీ కోసం రైతు చట్టాలను కొత్తరూపంలో కేంద్రం అమలు చేస్తున్నదని విమర్శించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీ నాయకులపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.